‘అమ్మ’కు భరోసా
పురుడు అంటేనే పునర్జన్మ అనే నానుడి.. ప్రస్తుతం కాన్పు అంటే కడుపుకోతగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య తగ్గుముఖం పట్టి పరిస్థితి మెరుగుపడుతుండగా.. ప్రైవేటు దవాఖానల్లో మాత్రం నేటికీ ఎక్కువ శాతం సిజేరియన్ ఆపరేషన్లే జరుగుతున్నాయి. సుఖ ప్రసవాలు జరిగేలా చూడాలని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా ప్రైవేటు
- ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ కాన్పులు
- ప్రైవేటులో పెరుగుతున్న సిజేరియన్లు
- కాసులు రాల్చుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రులు
- సాధారణ ప్రసవాలను పెంచడంపై ప్రభుత్వం దృష్టి
- ప్రోత్సాహకాలు, నిరంతర ఆడిటింగ్ చర్యలతో కట్టడి చేసే దిశగా చర్యలు
- నార్మల్ డెలివరీ అయితే మొక్క నాటేందుకు కలెక్టర్ పమేలా సత్పతి నిర్ణయం
యాదాద్రి భువనగిరి, మే 11 : పురుడు అంటేనే పునర్జన్మ అనే నానుడి.. ప్రస్తుతం కాన్పు అంటే కడుపుకోతగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య తగ్గుముఖం పట్టి పరిస్థితి మెరుగుపడుతుండగా.. ప్రైవేటు దవాఖానల్లో మాత్రం నేటికీ ఎక్కువ శాతం సిజేరియన్ ఆపరేషన్లే జరుగుతున్నాయి. సుఖ ప్రసవాలు జరిగేలా చూడాలని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా ప్రైవేటు ఆస్పత్రులు పెడచెవిన పెడుతున్నాయి. బిడ్డ అడ్డం తిరిగిందని.. ఇంకా చిన్నచిన్న కారణాలను సాకుగా చూపి భవిష్యత్‌లో ఎదురయ్యే అనారోగ్య సమస్యలను లెక్కచేయకుండా కాసుల దందాను సాగిస్తున్నాయి. ఇందుకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇకపై కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నది. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఇప్పటికే ఒక దఫా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల గైనకాలజిస్టులతో సమావేశాన్ని నిర్వహించగా.. మరో విడత సమీక్షించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రసవాలపై 15 రోజులకు ఒకసారి ఆడిటింగ్ కూడా నిర్వహించేందుకు వైద్యశాఖ అధికారులు సిద్ధం అవుతున్నారు.
ప్రైవేటులో 90 శాతం సిజేరియన్..
ప్రైవేటు దవాఖానల్లో సిజేరియన్లు లేనిదే ప్రసవం చేయడం లేదు. జిల్లాలో మొత్తం 147ప్రైవేటు ఆస్పత్రులు ఉండగా.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 5,694 ప్రసవాలు జరిగితే ఇందులో సాధారణ ప్రసవాలు 534(10శాతం), సిజేరియన్ ఆపరేషన్లు 5,160(90 శాతం) ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో సాధారణ ప్రసవాలు33(10 శాతం), సిజేరియన్ ఆపరేషన్లు 323(90 శాతం) జరిగాయి. ప్రైవేటులో సిజేరియన్ ఆపరేషన్లు పెరుగుతున్నాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒకసారి సిజేరియన్ అయితే మరో ప్రసవం కూడా సిజేరియన్ ద్వారానే అవుతుండడంతో వీటి సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉందని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. పెద్దమొత్తంలో బిల్లులు వసూలు చేసేందుకు సిజేరియన్లను ప్రైవేటు ఆస్పత్రులు ప్రోత్సహిస్తున్నాయనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై ప్రైవేటు దవాఖానలను తనిఖీ చేసి ఎన్ని సాధారణ కాన్పులు చేశారు?. ఎన్ని సిజేరియన్ ఆపరేషన్లు చేశారు? తదితర అంశాలపై జిల్లా వైద్యారోగ్య శాఖ నిరంతరం పర్యవేక్షించనుంది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగ్గుముఖం…
గతంతో పోలిస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో సహజ ప్రసవాలు పెరిగినప్పటికీ.. అవి ఇంకా పెరుగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తున్నది. అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ వంటి పథకాలను అమలులోకి తెచ్చిన తర్వాత కాన్పు కోసం వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇదే క్రమంలో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య సైతం గణనీయంగా తగ్గుతున్నది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో మొత్తం 3,369 ప్రసవాలు జరిగితే ఇందులో సాధారణ ప్రసవాలు 1,164(35 శాతం), సిజేరియన్ ఆపరేషన్లు 2,205(65 శాతం) జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన ప్రసవాలను పరిశీలిస్తే.. సాధారణ కాన్పులు 105(43 శాతం), సిజేరియన్లు 143(57 శాతం) జరిగాయి. కొందరు ముహూర్తాలు పెట్టుకుని ప్రసవాలు చేయించడం.. మరికొందరు నొప్పులు భరించడం తమవల్ల కాదని సిజేరియన్లు చేయించుకునేందుకు సిద్ధపడి తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతుండడం సరైంది కాదని వైద్యులు పేర్కొంటున్నారు.

నార్మల్ డెలివరీ అయితే మొక్క నాటేలా…
సాధారణ ప్రసవాలను పెంచడంలో భాగంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నార్మల్ డెలివరీ అయితే ఆ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోనే సంబంధీకులతో మొక్కను నాటించాలని సూచించగా.. బీబీనగర్ ఆసుపత్రి వైద్యులు తొలుత కార్యరూపంలోకి తీసుకొచ్చారు. ఇప్పటికే జిల్లాలో పలు దవాఖానలు సైతం ఇదే మార్గం అనుసరిస్తున్నాయి. మొక్కతోపాటు శిశువు పెరుగుతుందన్న ఆలోచనకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ కొద్దిరోజుల క్రితం ట్విట్టర్ వేదికగా కలెక్టర్‌ను అభినందించారు.
నిఘా పెడుతాం…
ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతుండడంపై నిఘా పెడుతాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్లు కొంత వరకు తగ్గాయి. కొద్దిరోజుల క్రితమే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు గైనకాలజిస్టులతో సమావేశాన్ని నిర్వహించి నెల రోజుల్లో సహజ ప్రసవాలు పెరిగేలా చూడాలని సూచించాం. ప్రసవాలపై ఆడిటింగ్ కూడా జరుపనున్నాం. ఎవరైనా ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ మల్లికార్జునరావు, డీఎంహెచ్ఓ, యాదాద్రి భువనగిరి జిల్లా
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

