రామగిరి, ఫిబ్రవరి 19 : పదో తరగతి విద్యార్థులకు ఆయా పాఠశాలల్లో ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షలు పక్కాగా నిర్వహించారా, మార్కుల నమోదు ప్రతిభ ఆధారంగా నమోదు చేశారా, లేదా అనే అంశంపై తనిఖీలకు జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని యాజమాన్యాల(ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, గురుకుల) పరిధిలోని పదో తరగతి విద్యార్థుల మార్కుల నమోదును పరిశీలించనుంది. ఇందుకోసం నల్లగొండ జిల్లాలో గెజిటెడ్ హెడ్మాస్టర్లతో 69 బృందాలను నియమించింది.
నల్లగొండ జిల్లాలో ఈ నెల 21, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ నెల 20వరకు టీమ్‌లు పరిశీలించి మార్కులను నిర్ధారించనున్నాయి. ఆ తర్వాతే ఇంటర్నల్ మార్కులను ఎస్ఎస్సీ బోర్డు వెబ్సైట్లో నమోదు చేయనున్నారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 540 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటిలో రాష్ట్ర ప్రభుత్వ, జడ్పీ స్కూళ్లు 229, మోడల్ స్కూళ్లు 17, కేజీబీవీలు 27, ఎయిడెడ్ పాఠశాలలు 17, అన్ ఎయిడెడ్ స్కూళ్లు 213, గురుకుల పాఠశాలలు 37 ఉన్నా యి.
వాటన్నింటిలో కలిసి 2024-25 విద్యా సంవత్సరంలో 18,666 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ఇక్కడ 69 బృందాలను ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 266 పాఠశాలలకుగానూ 178 జడ్పీ, మోడల్, కస్తూర్బా స్కూళ్లు, 14 గురుకులాలు, 74 ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో 8,631 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు.
ఇక్కడ 21 టీమ్‌లను ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లాలో 356 పాఠశాలలకుగానూ 11,912 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ 35 బృందాలను ఏర్పాటు చేశారు. అన్నిచోట్లా ఫార్మాట్ టెస్టులతోపాటు ప్రాజెక్టులు, రికార్డులు సంవత్సరం మొత్తం ఆయా సబ్జెక్టుల్లో ఉపాధ్యాయులు నిర్వహించి మార్కులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అవి సక్రమంగా ఉన్నాయా, లేదా అనే అంశాన్ని కమిటీలు నిర్ధారించనున్నాయి.
డీఈఓ బి.భిక్షపతి ఆధ్వర్యంలో టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో టీమ్‌లో ఒక గెజిటెడ్ హెడ్మాస్టర్, ఒకరు స్కూల్ అసిస్టెంట్, మరొకరు లాంగ్వేజి పండిట్‌ను నియమించారు. టీమ్ చైర్మన్ అయిన గెజిటెడ్ హెడ్మాస్టర్లతో సోమవారం సాయంత్రం డీఈఓ సమావేశం ఏర్పాటు చేసి సూచనలు ఇచ్చారు.
అన్ని పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఇప్పటి వరకు రెండు ఎఫ్ఏ టెస్టులు మాత్రమే నిర్వహించారు. వీటితోపాటు ప్రాజెక్టులు, ఇతర రికార్డులనూ ప్రత్యేక బృందాలు పరిశీలిస్తాయి. ప్రతి ఎఫ్ఏ టెస్టుకు 5 మార్కుల చొప్పున నాలుగు టెస్టులకు 20 మార్కులు కేటాయిస్తాయి. సీసీఈ నిర్వహణ, ఎస్ఏ టెస్టుకూ మార్కులు కేటాయిస్తారు. పరీక్షలు, రికార్డుల నిర్వహణ సక్రమంగా నమోదు చేయకున్నా, తప్పులున్నా సరిచేస్తారు. ఆ తర్వాత జిల్లా పరీక్షల విభాగం ఆమోదంతో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మార్కులను ఎస్ఎస్సీ బోర్డుకు అందజేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల నాణ్యత ప్రమాణాల మేరకే కచ్చితంగా నిబంధనల మేరకు మార్కులు ఇస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం బైకి బై మార్కులను వేస్తుండడం గత సంవత్సరం టీమ్స్ పర్యవేక్షణలో వెల్లడైంది. విద్యార్థుల పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోయినా ఎక్కువ మార్కులు వేయడంపై పలు పాఠశాలల్లో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పర్యాయం పరిస్థితి ఎలా ఉందనేది తనిఖీల అనంతరం తేలనుంది.
పదో తరగతి విద్యార్థుల నైపుణ్యాల మేరకు అసెస్మెంట్, ప్రాజెక్టుల్లో మార్కుల నమోదు ఉంటేనే కమిటీలు పార్వర్డ్ చేస్తాయి. లేనిపక్షంలో వారికి ఏ స్థాయిలో మార్కులు ఉండాలో సూచించి నివేదికలను జిల్లా విద్యాశాఖకు అందజేస్తాయి. ఆ తర్వాత కమిటీ నిర్ధారించిన మార్కులనే పాఠశాలలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఆయా పాఠశాలలపై చర్యలు తప్పవు.
– బి.భిక్షపతి, డీఈఓ నల్లగొండ