సూర్యాపేట, జూన్ 16 : అధికారులు, సిబ్బందితోపాటు జిల్లా ప్రజలందరం సమన్వయంతో పనిచేసి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించి రాష్ట్రంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుదామని నూతన కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయంలోని చాంబర్లో జిల్లా 7వ కలెక్టర్‌గా ఆదివారం ప్రస్తుత కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సేవలందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అట్టడుగు వర్గాలకు అందేలా కృషి చేస్తామని చెప్పారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపడుతామన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా అధికారులు, సిబ్బంది కలెక్టర్ పవార్‌కు పూల బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత, జడ్పీ సీఈఓ అప్పారావు, డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం, డీపీఓ సురేశ్‌కుమార్, డీపీఆర్ఓ రమేశ్, ఏఓ సుదర్శన్‌రెడ్డి , టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు జానీమియా పాల్గొన్నారు.కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తేజస్ నందలాల్ పవార్‌ను సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్ కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.