సూర్యాపేట, జూన్ 15 : సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా తేజస్ నందలాల్ పవార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం.. సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్‌ను ఇక్కడి నుంచి బదిలీ చేసింది. వనపర్తి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న తేజస్ నందలాల్ పవార్‌ను సూర్యాపేట కలెక్టర్‌గా నియమించింది. పవార్ 2018 ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన అధికారి. 2023 ఫిబ్రవరి 1న సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎస్.వెంకట్రావ్.. జిల్లాలో 15నెలల 15 రోజుల పాటు పనిచేశారు.
జిల్లాలో పాలనా పరమైన సంస్కరణలు, ఎన్నికల నిర్వహణలో ఆయన రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డులు అందుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ జిల్లాలో విజయవంతంగా పూర్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సమర్థవంతంగా నిర్వర్తించినందుకు గాను బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీస్ అవార్డు -2024ను అప్పటి గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ చేతుల మీదుగా అందుకున్నారు. ప్రజావాణిలో బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే వెబ్ ఎక్స్ ద్వారా క్షేత్ర స్థాయి అధికారులతో నేరుగా మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా చూశారు.
కలెక్టరేట్లో పేపర్‌లెస్ ఫైలింగ్, అధికారులు ఫైల్ పట్టుకొని తిరుగకుండా సమయం ఆదా చేయడానికి ఈ ఆఫీస్ విధానం అమలు చేశారు. దీంతో వేగంగా ఫైళ్ల కదలికతోపాటు ఫైల్ ఏ స్థాయిలో ఉన్నదో తెలుసుకునే విధంగా ఈ ఆఫీస్ విధానం ఎంతో ఉపయోగపడింది. ప్లాస్టిక్ రహిత కలెక్టరేట్‌గా మార్చి కార్యాలయాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించారు. సూర్యాపేట నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం వెంకట్రావ్ ఆధ్వర్యంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అయితే.. వెంకట్రావ్‌కు ప్రస్తుతం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేశారు. సూర్యాపేట జిల్లా ఏర్పాటు తరువాత 6వ కలెక్టర్‌గా తేజస్ నందలాల్ పవార్ పనిచేయనున్నారు.