రామగిరి, నవంబర్ 27 : ప్రీ ప్రైమరీ పాఠశాలలకు వచ్చే చిన్నారులకు ఆట పాటలతో విద్యా బోధన చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా విద్యాశాఖ- సమగ్రశిక్ష ఆధ్వర్యంలో నల్లగొండ డైట్ కళాశాలలో ఈ నెల 28 నుండి డిసెంబర్ 1 వరకు అందించే ‘ఎర్లీ వైల్డ్ లైఫ్ అండ్ ఎడ్యుకేషన్’ శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ఆమె పరిశీలించి మాడ్యూల్స్ అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో నూతనంగా 88 ప్రీ ప్రైమరీ పాఠశాలలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇందులో పనిచేసే ఇన్స్ట్రక్టర్స్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తల్లిదండ్రులను మైమరపించేలా పాఠశాలలకు ఇష్టంతో పిల్లలు వచ్చేలా బోధన అందించాలన్నారు. డీఈఓ బోల్లారం భిక్షపతి మాట్లాడుతూ.. ఇన్స్ట్రక్టర్స్ శిక్షణ ముగిసిన తర్వాత ఆయా పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులకు శిక్షణ అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సమగ్రశిక్ష సెక్టోరియల్ అధికారి ఆర్.రామచంద్రయ్య, డైట్ ప్రిన్సిపాల్ నర్సింహ్మ, రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.