పుష్కరకాలానికి ముందు ఎట్లుండె తెలంగాణ?ఉపాధిని వెతుక్కుంటూ వలస పోయిన యువత.. జాబ్‌లు రాక రోడ్డెక్కిన నిరుద్యోగులు.. సాఫ్ట్వేర్ అంటే బెంగళూరు, పుణె వైపు చూడాల్సిన దుస్థితి.. హైదరాబాద్ అంటే ఆందోళనల అడ్డా అన్నట్టు చిత్రీకరించిన ఆంధ్రా మీడియా! సకల భయాలతో పెట్టుబడులకు ముందుకురాని సంస్థలు! వచ్చినా, పట్టించుకోని ప్రభుత్వాలు! ‘పైనాపిల్’ బిల్డింగ్ ఒకటి కట్టి.. తెలంగాణనేదో ఉద్ధరించినట్టు పోజులు కొట్టిన పాలకులు!
రాష్ర్టావిర్భావంతో తెలంగాణ మిషన్ మోడ్‌లోకి మారింది. ఐటీ రంగం కోసం ప్రణాళికలు రచించింది కేసీఆర్ ప్రభుత్వం. సమస్యలను దాటుకుని,రెడ్‌టేపిజాన్ని పక్కకునెట్టి, పాతకాలపు జాడ్యాన్ని పటాపంచలు చేసి పాలసీలను ప్రకటించింది. పెట్టుబడుల ఆకర్షణకు సింగిల్‌విండో విధానాన్ని అమలుపరిచింది.
ఫలితంగా ఐటీ రంగంలో తెలంగాణ రాకెట్లా దూసుకుపోయింది. పదేండ్లలో 300 శాతం ఐటీ ఎగుమతులు పెరిగాయి. అన్ని ప్రధాన సంస్థల జీసీసీలు తరలివచ్చాయి. సాఫ్ట్వేర్రంగపు స్వర్గధామంగా తెలంగాణ మారింది. కేంద్రం తాజా గణాంకాలూ ఐటీ పురోగతిని పునరుద్ఘాటిస్తున్నాయి. కేసీఆర్ విజన్‌కు, కేటీఆర్ మిషన్‌కు, పదేండ్ల ప్రగతికి తార్కాణాలివే!
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్ర స్వాప్నికుడు.. ప్రత్యేక రాష్ట్ర సాధకుడు.. తెలంగాణ ప్రగతి ప్రదాత కేసీఆర్ హయాంలో ఐటీ రంగంలో తెలంగాణ కొత్త చరిత్ర లిఖించింది. బీఆర్ఎస్ పదేండ్లపాలనలో అంతర్జాతీయ కంపెనీలకు కేరాఫ్‌గా మారిన హైదరాబాద్.. దేశానికే కొత్త ఐటీ హబ్‌గా అవతరించింది. అప్పటి సీఎం కేసీఆర్ విజన్, నాటి ఐటీ మంత్రి కేటీఆర్ మిషన్‌తో వేలాది ఐటీ కంపెనీలు నగరానికి క్యూకట్టి ఐటీకి తెలంగాణ ఐకాన్‌గా నిలిచింది. ఐటీ ఎగుమతులు పెరిగి లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించాయి. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఐటీ ఎగుమతుల్లో 299 శాతం పెరుగుదల నమోదవ్వడమే కాదు దేశంలోని ప్రతి మూడు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణే సృష్టించిందంటే ఐటీ రంగం అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ‘ఐటీ ఎగుమతులను రెట్టింపు చేస్తాం.
మన నగరాన్ని ఐటీ హబ్‌గా మారుస్తాం’ అని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీకి మించి తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. కేటీఆర్ చెప్పినట్టు ఐటీ ఎగుమతులు రెండురెట్లు కాదు.. ఏకంగా నాలుగింతలయ్యాయి. కొత్త ఉద్యోగాలు పది లక్షలకు చేరాయి. ఎన్డీయేపాలిత 14 రాష్ర్టాల్లోని మొత్తం ఐటీ ఎగుమతులను కలిపినా 2023-24లో తెలంగాణ ఎగుమతి చేసిన ఐటీ ఎగుమతుల కంటే తక్కువే ఉండటం గమనార్హం. ఇదంతా కేసీఆర్ దార్శనికతతో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రవేశపెట్టిన వినూత్న ఐటీ పాలసీలు, నాటి ఐటీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ వల్లే సాధ్యమైంది. ఈ మేరకు 2023-24గానూ ఐటీ ఎగుమతులకు సంబంధించి కేంద్రప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో తేలింది.
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
2013-14లో అప్పటి కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్లు మాత్రమే ఉండేవి. అయితే, బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాల కారణంగా 2023-24 ఏడాదినాటికి ఐటీ ఎగుమతుల విలువ రూ.2,72,076 కోట్లకు చేరింది. ది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) కింద రాష్ట్రం నుంచి రూ.1,21,117 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరగ్గా.. స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్) కింద మరో రూ.1,50,959 కోట్లు విలువైన ఐటీ ఎగుమతులు జరిగినట్టు కేంద్ర గణాంకాలు తెలిపాయి. 2023-24కు గాను దేశవ్యాప్తంగా మొత్తం ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 15.56 శాతం ఉన్నట్టు గణాంకాల్లో తేలింది. మొత్తం ఐటీ ఎగుమతుల్లో 65 శాతం వాటా దక్షిణాది రాష్ర్టాలదే కావడం గమనార్హం.

బీఆర్ఎస్ హయాంలో ఐటీ వెలుగులు
కొత్తగా ఏర్పడిన తెలంగాణలో రాజకీయ సుస్థిరత, సమర్థ నాయకత్వానికి తోడు బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రగతిశీల పారిశ్రామిక విధానాలు తెలంగాణలో ఐటీ రంగానికి వెన్నుదన్నుగా నిలిచాయి. దీంతో భారత ఐటీ రంగ స్థూల అభివృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు ప్రతి ఏటా రెండు నుంచి మూడు రెట్లవరకూ ఎక్కువగానే ఉంటున్నది. కేసీఆర్ ప్రభు త్వం ప్రవేశపెట్టిన ఐటీ పాలసీలతో యాపిల్, అమెజాన్, సేల్స్‌ఫోర్స్, ఉబర్, మైక్రాన్, స్టేట్ స్ట్రీట్, మాస్ మ్యూచువల్, గూగుల్, ఇంటెల్, ప్రొవిడెన్స్, గోల్డ్మ్యాన్సాచ్స్, జెడ్ఎఫ్, యూబీఎస్, పెప్సీ వంటి దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌కు తరలివచ్చాయి. దీంతోపాటు ఫేస్బుక్, క్వాల్కామ్, అక్సెంచర్, వేల్స్ఫార్గో, క్సిలినిక్స్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, ఒరాకిల్, టీసీఎస్, ఐబీఎం, టెక్ మహీంద్ర, కాగ్నిజెంట్, విప్రో తమ కార్యకలాపాలను విస్తరించాయి. హైదరాబాద్‌లో ఐటీ రంగం వేగంగా పుంజుకోవడంతో దీని ప్రభావం మిగతా రంగాలైన నిర్మాణ, రవాణా, సేవా, ఆతిథ్య, వినోద రంగాల వృద్ధికి తోడ్పాటునిచ్చింది. ఒక్క ఐటీ ఉద్యోగంతో పరోక్షంగా మరో నాలుగు ఉద్యోగాలు వస్తాయని నిపుణులు చెప్తారు. బీఆర్ఎస్ హయాంలో 2023-24నాటికి ఐటీ రంగంలో 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నట్టు తేలింది. ఈ లెక్కన ఐటీ రంగాన్ని ఆధారంగా చేసుకొని వివిధ రంగాల్లో కొత్తగా 40 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగినట్టు అర్థం చేసుకోవచ్చు.
కేటీఆర్ ప్రత్యేక చొరవ
బీఆర్ఎస్ హయాంలో నాటి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో తెలంగాణలో వ్యాపార అనుకూల వాతావరణం, ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం, ఐటీ మౌలిక వసతులను అందుబాటులోకి తేవడంతో ఐటీ ఎగుమతులు భారీగా పెరిగాయి. పరిశ్రమలకు 15 రోజుల్లో అనుమతి ఇవ్వడానికి టీఎస్ఐపాస్, టీఎస్‌బీపాస్ వంటి కార్యక్రమాలను బీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టింది. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీహబ్-1, టీహబ్-2, హార్డ్‌వేర్ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు అతి పెద్ద ప్రొటో టైపింగ్ టీ వర్క్స్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం తెలిసిందే. టీహబ్, టీవర్క్స్పై కేంద్రం సహా పలు మేథో సంస్థలు ఇప్పటికే ప్రశంసలు కురిపించాయి.
ఐటీఐఆర్ ఇవ్వకపోయినా..
తెలంగాణకు రావాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్టును ఇవ్వకుండా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రంపై వివక్ష చూపింది. ఒకవేళ, ఐటీఐఆర్ ప్రాజెక్టు వస్తే 2035నాటికి రూ. 2.5 లక్షల కోట్ల ఎగుమతులకు చేరే అవకాశం ఉండేది. అయితే, కేంద్రం ఐటీఐఆర్‌ను రద్దు చేయడంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వమే ముందుకొచ్చి ఐటీ అభివృద్ధి కోసం ఎన్నో పాలసీలు, ప్రోత్సాహకాలను తీసుకొచ్చింది. ఫలితంగా 2013-14లో అప్పటి కాంగ్రెస్ పాలనలో ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్లుగా ఉంటే 2023-24 ఏడాది నాటికి ఈ ఎగుమతుల విలువ రూ.2,72,076 కోట్లకు చేరింది. ఐటీ రంగంలో దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
ఉద్యోగాల కల్పనలో మనమే టాప్
ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాల కల్పనలో తెలంగాణ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. నాస్కామ్ నివేదిక ప్రకారం.. 2022-23లో దేశంలో 4.5 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు రాగా అందులో 1.5 లక్షల మంది హైదరాబాద్ నుంచే ఉన్నారు. అంటే, దేశంలో వస్తున్న ప్రతి మూడు కొత్త ఐటీ ఉద్యోగాల్లో ఒకటి హైదరాబాద్ నుంచే వస్తున్నది. కొత్త ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ హయాంలోని తెలంగాణ దేశానికే రోల్ మాడల్‌గా నిలిచినట్టు నిపుణులెందరో ప్రశంసలు కురిపించడం తెలిసిందే.
టీహబ్ రయ్.. రయ్
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన టీ-హబ్ కొత్త రికార్డులను సృష్టించింది. కేవలం ఐటీ రంగంలోనే గాక, ఔషధ, బయో, మెడికల్, వ్యవసాయ, మహిళ, సామాజిక అంశాల్లో ప్రత్యేకంగా స్టార్టప్‌లకు టీ-హబ్ ఊతమందించింది. అలా టీ-హబ్ ఏర్పాటు చేసిన పదేండ్లలోనే 2 వేలకు పైగా స్టార్టప్‌లకు ప్రయోజనం చేకూరింది. తెలంగాణ టీ-హబ్‌ను ఆదర్శంగా తీసుకొనే మహారాష్ట్రలో ఎం-హబ్‌ను నిర్మిస్తుండటం గమనార్హం. కాగా, టీ-హబ్ స్ఫూర్తితోనే వీ-హబ్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, టాస్క్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్)లను ఏర్పాటు చేయడం గమనార్హం. దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ కేంద్రం టీవర్క్స్‌ను కూడా టీ-హబ్ స్ఫూర్తితోనే ఏర్పాటు చేయడం విశేషం.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎగుమతులు డల్
బీఆర్ఎస్ హయాంలో ఒకవైపు.. తెలంగాణకు ఐటీ కంపెనీలు క్యూకట్టి ఎగుమతులు అంతకంతకూ పెరగ్గా.. మరోవైపు, బీజేపీపాలిత రాష్ర్టాల్లో ఐటీ ఎగుమతులు ఆశించిన మేర లేకపోవడం గమనార్హం. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ చెప్తున్నా.. అందుకు పూర్తి భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని కేంద్ర గణాంకాల ద్వారా అర్థమవుతున్నది. మోదీ సొంత రాష్ర్టామైన గుజరాత్లో 2023-24 సంవత్సరానికిగానూ ఐటీ ఎగుమతుల విలువ కేవలం రూ.14,926 కోట్ల మేర జరిగినట్టు రిపోర్టు స్పష్టం చేసింది. యోగీ ఆదిత్యనాథ్ సీఎంగా ఉన్న మరో డబుల్ ఇంజిన్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్.. 2023-24లో రూ.79,497 కోట్లు మాత్రమే ఐటీ ఎక్స్‌పోర్ట్స్ చేసింది. మొత్తంగా ఎన్డీయేపాలిత 14 రాష్ర్టాల్లోని మొత్తం ఐటీ ఎగుమతులను కలిపినా 2023-24లో తెలంగాణ ఎగుమతి చేసిన ఐటీ ఎగుమతుల కంటే తక్కువే ఉండటం గమనార్హం.
నైపుణ్యాల పెంపునకు టాస్క్
ఐటీతో పాటు ఇతర రంగాల్లో యువతకు అవసరమైన నైపుణ్యాలు కల్పించడమే లక్ష్యంగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)ను ఏర్పాటు చేసింది. టాస్క్ ద్వారా పదేండ్ల వ్యవధిలో 10 లక్షల మందికి పైగా యువతీ యువకులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ లభించింది. ఐటీతో పాటు ఐటీఈఎస్, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ వంటి అనేక రంగాల్లోనూ టాస్క్ శిక్షణ ఇస్తున్నది. అంతేకాదు వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించడంలో సహకారం అందించింది. అందుకే కేసీఆర్ సర్కార్ ప్రారంభించిన ‘టాస్క్’ సేవలను నీతి ఆయోగ్ వంటి మేధో సంస్థలు కూడా ప్రత్యేకంగా ప్రశంసించాయి.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ‘ఐటీ’ దూకుడు ఇలా
ఐటీతో మరిన్ని ఉద్యోగాలు
టీ-హబ్‌తో ఏం జరిగింది?
గత పదేండ్లలో ఐటీ ఎగుమతులు, ఉద్యోగాలు ఇలా…
