– తక్షణమే నూతన పీఆర్సీ ప్రకటించాలి
– పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్
రామగిరి, జూలై 14 : తెలంగాణ ప్రభుత్వం తక్షణమే నూతన పీఆర్సీని ప్రకటించి, పెండింగ్ బకాయిలను చెల్లించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బత్తిని భాస్కర్ గౌడ్ అన్నారు. టీపీయూఎస్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యారంగ, ఉపాధ్యాయ, సమస్యలను పరిష్కారించాలని కోరుతూ కలెక్టరేట్ మహాధర్నా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. పీఆర్సీ రిపోర్టులను తక్షణమే తెప్పించుకుని 51 శాతం ఫిట్ మెంట్ ప్రకటించాలని, ఇ- కుబేర్లోని నిలిచిపోయిన పెన్షనర్లు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులను పూర్తిగా చెలించాలని డిమాండ్ చేశారు. 8 డీఏలను వెంటనే విడుదల చేయాలని, కేజీబీబీ, ఎస్ఎస్ఏ మహిళా సిబ్బంది. సమ్మె కాలం జీతాన్ని చెల్లిస్తూ ఎంటీఎస్ అమలు చేయాలని కోరారు.
190 జీవోను విద్యాశాఖలోనూ పూర్తిస్థాయిలో వర్తింపజేయాలని, 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ (ఓపీఎస్) అమలు చేస్తూ సుప్రీంకోర్టులోని ఎస్ఎల్పీని వెనక్కి తీసుకోవాలని కోరారు. సీపీఎస్ రద్దు, హెల్త్ కార్డుల ట్రస్ట్ మార్గదర్శకాల సవరణ, బడుల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయుల బదిలీల క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆగస్టు 1న రాష్ట్రస్థాయి మహాధర్నా చేపడతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ బి.చంద్రశేఖర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ ధర్నాలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, రాష్ట్ర బాధ్యులు ఇరుగు శ్రీరామ్, విజయ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పెన్షనర్ల సంఘం నాయకులు కొంపెల్లి భిక్షపతి, గణేష్, పి.రామకృష్ణారెడ్డి, 2003 డీఎస్సీ బాధ్యులు లక్ష్మీనారాయణ, బీసీటీయూ నాయకులు శంకర్ గౌడ్ పాల్గొన్నారు.

నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల ధర్నా