రామగిరి, డిసెంబర్ 28 : దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక భూమిక అని పలువురు వక్తలు స్పష్టం చేశారు. రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర 6వ విద్య, వైజ్ఞానిక మహాసభల వేదికపై ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. టీఎస్ యూటీఎఫ్ మహాసభలు నల్లగొండ పట్టణం లో శనివారం అట్టహాసంగా మొదలయ్యాయి. ముందుగా క్లాక్‌టవర్ సెంటర్లో వేలాది మంది టీచర్లతో మహా ప్రదర్శనను మహాసభల చైర్మన్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రారంభించగా, లక్ష్మీగార్డెన్స్ వరకు ర్యాలీ సాగింది.
అనంతరం అమర జీవి షేక్ మహబూబ్ అలీ ప్రాంగణంలో జాతీయ జెండా, ఎస్టీఎఫ్ఐ, టీఎస్‌యూటీఎఫ్ పతాకాలను యూటీఎఫ్ నాయకులు ఆంజనేయులు, విద్యాసాగర్‌రెడ్డి, బంగారయ్య ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంతోపాటు రాష్ట్రాల అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక కారణాలతో డ్రాపవుట్స్ పెరుగుతున్నాయని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో 66 శాతం అక్షరాస్యత ఉన్నదని, దానిని 100 శాతానికి పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ మత విశ్వాసాలను, మూఢనమ్మకాలను పెంచి పోషించే విద్యా విధానం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తంచేశారు. విద్య కాషాయీకరణ సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంతో పేద విద్యార్థులు చదువు దూరమయ్యే ప్రమాదం నెలకొందన్నారు. కార్పొరేట్ శక్తులతో విద్య వ్యాపార వస్తువుగా మారిందని పేర్కొంటూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు బడ్జెట్‌ను పెంచాలని కోరారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ అంతా ఇన్చార్జీల పాలనలో సాగుతుందని, ప్రభుత్వ ప్రత్యేక దృష్టి సారించాలని అభిప్రాయపడ్డారు.
ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మాట్లాడుతూ వ్యక్తి అభ్యున్నతికి, సమాజ వికాసానికి విద్య అవసరమన్నారు. ఉపాధ్యాయులు వేసే పునాదుల ద్వారానే సమాజ అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్లే విద్యా ప్రమాణాలు తగ్గుతున్నాయని విమర్శించారు. విద్యా రంగానికి అతి తక్కువ బడ్జెట్ కేటాయించడం దేశాభివృద్ధికి ఆటంకమన్నారు. తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ 206 సంఘాలతో జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్నామన్నారు. రెండో పీఆర్సీ, డీఏలు, ఈహెచ్ఎస్ను వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్టీఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షురాలు మోతుకూరి సంయుక్త మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సీపీఎస్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నామన్నారు.
అందరికీ నాణ్యమైన, సమానమైన విద్యా విధానం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఏపీ యూటీఎఫ్ అధ్యక్షుడు నక్క వెంకటేశ్వర్లు, టాప్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ రాములు, కోశాధికారి లక్ష్మారెడ్డి, కార్యదర్శి ఎం.రాజశేఖర్‌రెడ్డి, జి.నాగమణి, ఆహ్వాన సంఘం ఫ్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశ్వర్లు, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసాచారి, ఆడిట్ కమిటీ కార్యదర్శి యాకయ్య, జిల్లా కోశాధికారి నర్రా శేఖర్‌రెడ్డి, నల్లపరాజు వెంకన్న, సాంస్కృతిక కమిటీ కన్వీనర్ నల్లా నర్సింహ, జిల్లా మాజీ అధ్యక్షుడు ఎడ్ల సైదులు పాల్గొన్నారు.
మహాసభల సందర్భంగా మధ్యాహ్నం జరిగిన విద్యా సదస్సులో ‘భారత ఆర్థిక వ్యవస్థలో మధ్య తరగతి ప్రజలకు ఏం జరుగుతోంది’ అంశంపై మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్రావు ప్రసంగించారు. దేశంలో పాలకులు అవలంబిస్తున్న అసంబద్ధమైన విధానాల వల్లే సమాజంలో అంతరాలు పెరుగుతున్నాయన్నారు. సమాజాన్ని మార్చే శక్తి ఉపాధ్యాయులకు మాత్రమే ఉందని, అంకితభావంతో పని చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని సూచించారు. జేఎన్‌యూ మాజీ అధ్యక్షురాలు, ఎస్ఎఫ్ఐ జాయింట్ సెక్రెటరీ అయిషీ ఘోష్ ‘జాతీయ విద్యా విధానం – ప్రభుత్వ విద్యపై ప్రభావం’ అంశంపై మాట్లాడారు.
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యా రంగం నుంచి తప్పుకోవడానికే ప్రైవేట్ విద్యా రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. ఎన్ఈపీ-2020 ద్వారా రాష్ర్టాల విద్యా వ్యవస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తున్నదన్నారు. ‘విద్యలో రాజ్యాంగ విలువలు’ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన విద్యా విధానంలో రాజ్యాంగ చిత్తశుద్ధి లేదన్నారు. ప్రభుత్వ బడుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల పిల్లలే చదువుతున్నారని, ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేందుకు చొరవ చూపాలన్నారు. రాత్రి సాంస్కృతిక ప్రదర్శనలో సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ పాట, మాటలతో ఆలరించారు.