రామగిరి, జూలై 24 : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కార్యదర్శి నలపరాజు వెంకన్న, జిల్లా క్రీడా కమిటీ కన్వీనర్ బి.సురేందర్ రెడ్డి, డీటీఎఫ్ నాయకుడు లింగమల్లు అన్నారు. గురువారం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) ఆధ్వర్యంలో జరిగే మూడు దశల పోరాట కార్యక్రమంలో భాగంగా తిప్పర్తి మండల తాసీల్దార్‌కు మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆగస్టు 1న జిల్లా కేంద్రాల్లో ధర్నా, ఆగస్టు 23న హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల షెడ్యూల్‌ను తక్షణమే విడుదల చేసి, ఈ నెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేయాలి. అర్హత లేని డీఈఓలను వెంటనే తొలగించాలి. నూతన జిల్లాలకు డీఈఓ పోస్టులను, ప్రతి రెవెన్యూ డివిజన్‌కు డిప్యూటీ ఈఓ, నూతన మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేయాలి. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్‌ను రూపొందించి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఉపాధ్యాయుల, పెన్షనర్ల వివిధ రకాల బిల్లులను వెంటనే విడుదల చేయాలి. ప్రాథమిక పాఠశాలలకు 5,571 పీఎస్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలి. పండిట్, పీఈటీల అప్‌గ్రేడేషన్ పూర్తి అయినందున జీఓ నం.2, 3, 9, 10 లను రద్దు చేసి జీఓ నం. 11,12 ప్రకారం పదోన్నతులు కల్పించాలి.
ఉపాధ్యాయుల సర్దుబాటు మార్గదర్శకాలను సవరించాలి. జిల్లాల్లో జరిగిన అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలి. గురుకుల టైం టేబుల్ సవరించాలి. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు వేతనాలు 010 కింద చెల్లించాలి. కేజీబీవీ టీచర్ల సమ్మె కాలపు వేతనాలు వెంటనే చెల్లించాలి. ఈ కార్యక్రమంలో తిప్పర్తి మండల టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ ఖైరుద్దున్, ఆదిమల్ల శ్రీనివాస్, పటాలె వెంకట్ రావు, వీరాచారి, విద్యాసాగర్, సైదయ్య పాల్గొన్నారు.