కట్టంగూర్, మార్చి 15 : ప్రమాదవశాత్తు ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్ల టాటా ఏస్ ట్రాలీ వాహనం దగ్ధమైంది. ఈ ఘటన శనివారం కట్టంగూర్ లోని కురుమర్తి రోడ్డులో జరిగింది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కురుమూర్తి గ్రామంలో బర్రెలను లోడ్ చేసుకుని వచ్చేందుకు కట్టంగూర్కు చెందిన ఏనుగు కృష్ణ తన టాటా ఏసీ వాహనంతో బయల్దేరాడు.
మార్గమధ్యంలోని సత్యనారాయణ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ఇంజిన్ లో మంటలు ఏర్పడి వాహనాన్ని చుట్టుముట్టాయి. గమనించిన కృష్ణ వెంటనే వాహనం నుంచి దిగి ప్రాణాలు కాపాడుకుని ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించాడు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పి వేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పు చేసి వాహనం కొనుగోలు చేసినట్లు, అది ఇప్పుడు పూర్తిగా కాలిపోవడంతో తనకు ఉపాధి లేకుండా పోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.