మిర్యాలగూడ, డిసెంబర్ 3 : కేంద్రంలోని మోదీ సర్కార్ దేశ ప్రజల సంపదను కార్పొరేట్లకు, అదానీ, అంబానీకి దోచి పెడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మిర్యాలగూడ పట్టణంలో జరుగుతున్న సీపీఎం జిల్లా మహాసభల్లో మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం భారతదేశంలోని వివిధ రాష్ర్టాల్లో ప్రభుత్వ పెద్దలకు అదానీ గ్రూప్ భారీగా ముడుపులు ముట్టజెప్పిందని అమెరికా కోర్టులో కేసు నమోదైందన్నారు. అదానీ వ్యవహారం దేశానికి అప్రతిష్టగా మారిందని, దీనిపై ఇప్పటికీ ప్రధాని మోదీ నోరు మెదపకపోవడం శోచనీయమని విమర్శించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించకుండా విజయోత్సవాలు నిర్వహించడమేంటని ప్రశ్నించారు.
ఆరు గ్యారెంటీలను అమలు చేయడం లేదని, హైడ్రా, మూసీ వంటి వాటిని తీసుకొచ్చి ప్రజల సమస్యలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. పేదలకు ముందే ఇండ్లు నిర్మించి ఇచ్చి ఆ తరువాత మూసీ ప్రక్షాళన చేయాలని సూచించారు. రేవంత్‌రెడ్డి మాటల్లోనే ప్రజాస్వామ్యం ఉందని, చేతల్లో నిర్బంధకాండ ప్రయోగిస్తున్నారని పేర్కొన్నారు. సీపీఎం పోరాటంతో ఫార్మాసిటీ రద్దు అయ్యిందని, హామీల అమలు కోసం ప్రభుత్వం మెడలు వంచుతామని అన్నారు.
కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేశ్, సయ్యద్ హాషం, కందాల ప్రమీల, ప్రభావతి, నాగార్జున, కూన్‌రెడ్డి నాగిరెడ్డి, బండా శ్రీశైలం, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.