మునుగోడు, మే 13 : విద్యుత్ సమస్యల పరిష్కారంలో మునుగోడు నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎన్సీపీడీసీఎల్ సీఎండీ ముషారఫ్‌ను కోరారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న విద్యుత్ సమస్యలను ముఖ్య నాయకులతో కలిసి హైదరాబాద్‌లోని టీజీ ఎస్పీడీసీఎల్ రాష్ట్ర కార్యాలయంలో సీఎండీ ముషారఫ్‌ను కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న లో ఓల్టేజి సమస్య, అదనపు ట్రాన్స్ఫార్మర్ల కేటాయింపు, అదనపు సబ్ స్టేషన్ల నిర్మాణం, లూజు లైన్ల సమస్యలు, గృహాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల పైన ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగల తొలగింపు సమస్యలను సీఎండీ ముషారఫ్ అలాగే యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలకు సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను సావధానంగా విన్న సీఎండీ ముషారఫ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అక్కడే ఉన్న యాదాద్రి, నల్లగొండ జిల్లాల విద్యుత్ అధికారులను ఆదేశించారు.
నాణ్యమైన, భద్రతతో కూడిన కరెంట్ ఇచ్చే విధంగా రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ శాఖలో సమూలమైన సంస్కరణలు తీసుకొస్తుందని, ఆ సంస్కరణలు మొదట మునుగోడు నియోజకవర్గం నుండే మొదలుపెట్టాలని, మునుగోడు నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని విద్యుత్ అభివృద్ధి పనులు చేయాలని సీఎండీని ఎమ్మెల్యే కోరారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న కరెంట్ సమస్యలు పరిష్కరించడానికి రూ.34 కోట్లు అవసరమవుతున్నాయని, ప్రత్యేక దృష్టితో ఈ నిధులు మంజూరు చేయాలని సీఎండీకి వినతి పత్రం అందజేశారు. విద్యుత్ శాఖలో పనిచేసే అధికారులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రజలను వేధించి డబ్బులు వసూలు చేస్తున్న విషయాలు తన దృష్టికి వచ్చాయని, దీనివల్ల ప్రజా ప్రతినిధులుగా తమకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. దయచేసి ఎవరైతే అవినీతి పాల్పడుతున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకుని స్ట్రీమ్ లైన్ చేయాలని సీఎండీని కోరారు.
ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. మునుగోడు పైన ప్రత్యేక దృష్టి ఉంటుందన్నారు. వ్యవసాయ పొలాల మధ్యన ఉన్న ట్రాన్స్ఫార్మర్లను వెంటనే మార్పిస్తామని, వాటి ఎత్తు కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అగ్రికల్చర్ డీపీఆర్ లకు ఏబీ స్విచ్‌లు మొత్తం పెంచుతామని, మే నుండి జూన్ మధ్యలో ఏబీ స్విచ్‌లు మొత్తం రిపేర్ చేయాలని అక్కడే ఉన్న అధికారులను సీఎండీ ఆదేశించారు.