తిప్పర్తి, సెప్టెంబర్ 28 : ‘ప్రజలకు హామీలు ఇచ్చి గద్దెనెకిన తర్వాత వాటిని గాలికి వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలపై ప్రజలు నిలదీయాలి’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ తీసుకొచ్చిన కాంగ్రెస్ బాకీ కార్డులను తిప్పర్తి మండల కేంద్రంలో ప్రతి ఇంటికీ వెళ్లి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధికారం కోసం అడ్డగోలుగా హమీలు ఇచ్చి నేడు వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ ఎకడికకడ బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. ఎకడికెళ్లినా ప్రజలు, రైతులు, వృద్ధులు కాంగ్రెస్‌పై దుమ్మె త్తి పోస్తున్నారన్నారు. పచ్చి మోసం చేసిన కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, సందర్భం ఏదైనా కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాత పెడతామని చెబుతున్నారని అన్నారు. ఏడాదిన్నర కాలంలోనే కాంగ్రెస్ పతనం ప్రారంభమైందన్నారు.
కర్నాటక ప్రభుత్వం మరోసారి ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుతుందని, ఇది దక్షణ తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, పాలమూరు ఉమ్మడి జిల్లాలకు మరణ శాసనం అవుతుందని అన్నారు. కర్నాటక ప్రభుత్వం గతంలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందన్నారు. మళ్లీ దాని ఎత్తు పెంచేందుకు ప్రయత్నం చేస్తోందని, ఇదే జరిగితే దక్షణ తెలంగాణ ఏడారిగా మారే ప్రమాదం ఉందని అన్నారు.
ఇక్కడి భూములు పడావు పడి తిరిగి వలసలు పెరిగిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఎంతసేపు కమీషన్లు, పంపకాలు తప్పితే తెలంగాణ రైతాంగ సమస్యల గురించి అవగాహన లేదని విమర్శించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కైతే నీళ్ల గురించి ఎలాంటి అవగాహన లేదన్నారు. ఆయన ఓ డమ్మీ మంత్రి అని విమర్శించారు. రెండుమూడు రోజుల్లోనే కేసీఆర్ నాయకత్వంలో ఆల్మట్టి పెంపును అడ్డుకునేందుకు కార్యక్రమం చేపడతామన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబుకు గురుదక్షిణగా తెలంగాణ నీటి హకులను కట్టబెడుతుంటే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తండు సైదులుగౌడ్, నాయకులు కందుల లక్ష్మయ్య, లోడంగి గోవర్ధన్, మండల మాజీ అధ్యక్షుడు శిరసవాడ సైదులు తదితరులు పాల్గొన్నారు.
బాకీ కార్డులు ముందుపెట్టి కాంగ్రెస్‌ను నిలదీయాలి
సూర్యాపేట, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ‘గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు… 420 హామీల పేరిట అలవికాని మాటల గారడీలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చిన 22 నెలల తరువాత తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికల కోసం మరోసారి మోసపూరిత మాటల మూటలతో రాబోతున్నారు. నాడు కాంగ్రెస్ నాయకులు సంతకాలు చేసి ఇచ్చిన గ్యారంటీ కార్డులు, ఏయే వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ ఉందనే లెక్కలతో నేడు బీఆర్ఎస్ ఇస్తున్న బాకీ కార్డులను ముందు పెట్టి నిలదీయాలి’ అని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ కార్డు ప్రకారం అమలు చేయకపోవడంతో బీఆర్ఎస్ తయారు చేసిన బాకీ కార్డులను ఆదివారం చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామంలో ఇంటింటికి తిరిగి పంపిణీ చేస్తూ మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి జనంతో ముచ్చటించారు. జగదీశ్‌రెడ్డి వచ్చినట్లు తెలుసుకున్న జనం పెద్ద ఎత్తున వచ్చి బాకీ కార్డులు తీసుకుంటూ వామ్మో… నిజమే కాంగ్రెసోళ్లు గింత మోసం చేశారా..? అంటూ వాటిని చదువుతూ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 22 నెలలు పూర్తయిందని, అధికారంలోకి వచ్చేందుకు ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. ‘ఆరు గ్యారంటీల్లో రైతు రుణమాఫీ డిసెంబర్ 29న పూర్తి చేస్తామని స్వయానా నాటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను నేటి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫొటోతో పంపిణీ చేసి దాచి పెట్టుకొమ్మని సంతకాలు చేసి ఇచ్చారు. అవన్నీ అందరి కాడ ఉన్నాయి. 22 నెలల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు’ అని అన్నారు.
రూ.50 వేల కోట్ల రుణ మాఫీకి చేసింది రూ.17 వేల కోట్లే
రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ ప్రకారం రా్రష్ట్రంలో రూ.50 వేల కోట్లు చేయాల్సి ఉండగా రూ.20 వేల కోట్లు మాత్రమే అని చెప్పి చివరకు రూ.17 వేల కోట్లు చేసినట్లు కాంగ్రెస్ చెప్పిందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. రైతుబంధు కాదు భరోసా అంటూ కేసీఆర్ ఇచ్చిన రూ.10 వేలను రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ ఒక్కో ఎకరాకు రూ.19 వేలు బాకీ ఉందన్నారు. హామీలన్నింటినీ స్థానిక కాంగ్రెస్ నాయకులే చెప్పలేదని, స్వయానా ఢిల్లీ నుంచి వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున కర్గే, రాహుల్‌గాంధీ, ఆయన సోదరి ప్రియాంక, సోనియమ్మ చెప్పారని గుర్తు చేశారు. రాహుల్‌గాంధీ ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వ ఏర్పాటైన తరువాత అసెంబ్లీలో ఖానూన్ చేస్తామని నమ్మబలికినా ఒక్కటీ అమలుకు నోచుకోలేదన్నారు.
ఏదీ ఇవ్వరు.. అడిగితే దాడులు, అరెస్టులు
ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఆలోచనతో ఇచ్చిన హామీలను ఏదీ అమలు చేయకపోగా ఎవరైనా సమస్య కోసం ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతూ అరెస్టులు చేస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, ఆయాలు తమ సమస్యలపై ప్రశ్నించి ఇంటి నుంచి బయటకు వెళ్లకముందే అరెస్టులు, అడిగితే దెబ్బలు తప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూరియా దొరకడం లేదని..
యూరియా కోసం లైన్లల్ల మహిళలు మృతి చెందుతున్నారన్నారు. యూరియా కోసం వచ్చి లైన్లలో చనిపోయిన రైతు కుటుంబాలను కనీసం పట్టించుకోవడం లేదన్నారు. ‘ఇలాంటి కాంగ్రెస్ మళ్లీ ఏ ముఖం పెట్టుకొని వస్తదో అడగాలి. కాంగ్రెస్ గ్యారంటీ కార్డును, నేడు బీఆర్ఎస్ బాకీ కార్డులు ముందు పెట్టి అడగాలి. బాకీ కట్టి పోవాలని నిలదీయాలి’ అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సిన బాకీలను బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఇప్పించే బాధ్యత మాపై ఉందని, అందుకే బాకీ కార్డులను ప్రజలకు ఇస్తున్నామని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం దండగ
సూర్యాపేట, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు… 420 హామీలకు సంబంధించి ఆయా వర్గాలకు బాకీ కార్డులను ఇచ్చేందుకు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆదివారం వెళ్లిన సమయంలో ఓ మహిళ చేసిన వ్యాఖ్యలు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అద్దం పడుతోంది. సూర్యాపేట నియోజకవర్గం చివ్వెంల మండలం ఉండ్రుగొండలో ఇంటింటికీ వెళ్లి బాకీ కార్డులను ఇచ్చి ప్రభుత్వం ఆయా వర్గాలకు ఇచ్చిన హామీల మేరకు ఎవరెవరికి ఎంత బాకీ ఉందో చెబుతున్నారు.
ఈ క్రమంలో యలగబొయిన ఉప్పలమ్మ ఇంట్లోకి వెళ్లగా అక్కడ జగదీశ్‌రెడ్డిని మాట్లాడనీయకుండా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఆమె వివరించారు. ‘యూరియా కోసం పడుతున్న కష్టాలు చూస్తుంటే.. కేసీఆర్ సార్ మళ్లీ వెంటనే వస్తే బాగుండనిపిస్తుంది. కాంగ్రెస్ రైతుబంధు ఎగ్గొట్టిందని మా అందరి రైతులకు తెలుసు’ అని అన్నారు. పక్కనున్న వారు ఈ ఇంట్లో గా మధ్యన కూతురు పెళ్లయిందని జగదీశ్‌రెడ్డికి చెబితే అవునయ్యా… మా ఇంట్లో కూతురి పెళ్లి చేసినం. లక్ష రూపాయల కళ్యాణలక్ష్మి, తులం బంగారం వస్తదనుకున్నం.. ఏదీ రాలేదు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మా ఊర్లనే పెళ్లయిన ఇంటికి లక్ష రూపాయల కళ్యాణలక్ష్మి వచ్చింది. ఇప్పుడు రేవంత్ ఇస్తానన్న తులం బంగారమేందో.. ఏమోగాని లక్ష కూడా రాలేదు అని చెప్పడంతో.. నేను నీకు కొత్తగా చెప్పేది ఏమీ లేదని జగదీశ్‌రెడ్డి అక్కడి నుంచి కదిలారు.