ప్రజల కోసం పని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదని, ఆ పార్టీకి ఓటు వేస్తే 3 కొట్లాటలు, 6 కేసులు అన్నట్లు పరిస్థితి తయారవుతుందని బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దశాబ్దాలుగా కాంగ్రెస్ చేయని అభివృద్ధిని పదేండ్లలోనే చేసి చూపించామన్నారు. యువతకు ఉపాధి లక్ష్యంగా భవిష్యత్ పాలన ఉంటుందని, సూర్యాపేటలో వెయ్యి ఎకరాల్లో పారిశ్రామిక హబ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కండ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
సూర్యాపేట రూరల్, నవంబర్ 20 : ప్రజల కోసం పని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఏనాడు లేదని, ఆ పార్టీకి ఓటు వేస్తే 3 కొట్లాటలు, 6 కేసులే మనకు దిక్కవుతాయని బీఆర్ఎస్ సూర్యాపేట నియోజక వర్గ అభ్యర్థి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట మండలంలో కేసారం, కాసరబాద్, తాళ్లకాంపాడ్, రామ్ల్లాతండా, రూప్ల్లాతండా, జాటోతుతండా, ఇమాంపేట గ్రామాల్లో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ గ్రామాల్లోకి వచ్చిన అభిమాన నేతకు పొలిమేర నుంచే ఎదురెళ్లి మంగళ హారతులు, పూలవర్షంతో ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే ఎన్నోసార్లు ఓటు వేసిన ప్రజలు ఎవరికి వేసిన ఓటుతో ఏమొచ్చిందో ఆలోచన చేయాలని కోరారు. మనం వేసే ఓటే మన తలరాతను మారుస్తుందని చెప్పారు. 2009లో వేసిన ఓటు 5 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేదన్న మంత్రి 2014లో కారు గుర్తుకు వేసిన ఓటు 24 గంటల కరెంట్‌ను తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
ఊర్లలో కొట్లాటలు.. సూర్యాపేటలో దందాలే కాంగ్రెస్ నైజం అన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ అభివృద్ధి శూన్యమన్నారు. ఆ పార్టీ పాలనలో 3 కొట్లాటలు, 6 కేసులతో నాయకులకు పొలీస్ స్టేషన్ల పైరవీలు తప్పా అభివృద్ధిపై సోయే ఉండేది కాదన్నారు. కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో ఒకరికో ఇద్దరికో పెన్షన్లు వస్తే పెన్షన్ రానివారు తీసుకుంటున్న వారి చావు కోసం ఎదురు చూసే దౌర్భాగ్యపు పరిస్థితులు ఉండేవని దుయ్యబట్టారు. 2014 తర్వాత ఒక్కో గ్రామంలో సుమారు 500 మందికి తక్కువ కాకుండా పెన్షన్లు వస్తున్నట్లు చెప్పారు. 2014లో కారు గుర్తుకు వేసిన ఓటు రైతు బంధు,
రైతు బీమా, కల్యాణలక్ష్మి, స్వచ్ఛమైన తాగునీరు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చినట్లు వివరించారు. 2018లో వేసిన ఓటు కూడా 10 వేలు రైతు బంధు, 2 వేల పింఛన్, రూ.లక్ష కల్యాణలక్ష్మిని తీసుకువచ్చినట్లు చెప్పారు. పార్టీలకతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ఆ పరిస్థితి ఉండదన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలని సూచించారు. తండాలను గ్రామ పంచాయతీలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. 60 ఏండ్లలో కాంగ్రెస్ చేయని అభివృద్ధిని కేవలం పదేండ్లలో చేసి చూపించినట్లు తెలిపారు.
పది వేల మంది యువతీ, యువకులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా వెయ్యి ఎకరాల్లో పారిశ్రామిక హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దాంతో పాటు శాశ్వత ఐటీ టవర్లను నిర్మించి 3 వేల మంది స్థానిక యువతీయువకులు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. డ్రైపోర్టు తీసుకువచ్చి గ్రామాల్లోని నిరుపేదలకు అందులో ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ గెలిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు వస్తాయన్న మంత్రి నిరుపేద మహిళల కోసం సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా నెలకు రూ.3 వేలు, రైతు బీమా తరహాలో ప్రతి పేదవారికి రూ.5 లక్షలతో కేసీఆర్ బీమా, 400కే గ్యాస్ సిలిండర్, తెల్ల రేషన్‌కార్డుదారులకు సన్న బియ్యం ఇల్లు లేని ప్రతి పేదవారికి పక్కా ఇల్లు, ఆసరా పెన్షన్ 4 వేలు, దివ్యాంగుల పెన్షన్ 6 వేలు, రైతు బంధు 16 వేలు, మహిళా సమాఖ్యలకు భవనాల నిర్మాణం వంటి పథకాలను అమలు చేస్తామని పేర్కొన్నారు.
ఇదే ఉత్సహాన్ని ఈ నెల 30 వరకు కొనసాగించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే ఓటు వేసిన వారంతా గర్వపడేలా అభివృద్ధి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వంగాల శ్రీనివాస్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు ముదిరెడ్డి సంతోశ్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సూర్యాపేట టౌన్ : పట్టణంలోని గాంధీనగర్ ఎస్సీ కాలనీవాసులు కారు గుర్తుకు జై కొట్టారు. జిల్లా కేంద్రంలతోని పార్టీ కార్యాలయంలో ఎస్సీ కాలనీకి చెందిన శ్రీకాంత్, రుత్విక్, యాకూబ్, విజయ్, మధు, అనీల్‌తో పాటు 106 మంది అంబేద్కర్ యూత్ సభ్యులు బీఆర్ఎస్లో చేరారు. అలాగే పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు అనంతుల శ్రీనివాస్‌గౌడ్, 31వ వార్డు కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు రాపర్తి నాగరాజు 83 మంది కార్యకర్తలతో కలిసి మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. జరుగుతున్న అభివృద్ధి యజ్ఞంలో పార్టీలకతీతంగా ప్రజలు భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం ముదిరాజ్‌ల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కొండపల్లి దిలీప్‌రెడ్డి, నాయకులు మారిపెద్ది శ్రీనివాస్, దేవరకొండ జనార్దన్, రఫీ, రంగినేని ఉపేందర్‌రావు, అనంతుల దుర్గాప్రసాద్, వెన్న శ్రీనివాస్‌రెడ్డి, టైసన్ శ్రీను, సలిగంటి నాగయ్య పాల్గొన్నారు.
ఆత్మకూర్.ఎస్ : కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్‌రెడ్డికి ఓటేస్తే హత్యా రాజకీయాలు, గ్రామాల్లో సమాధులే మిగిలాయని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. మండలంలోని బోట్యాతండా, తుమ్మలపెన్‌పహాడ్, కోటపహాడ్, శెట్టిగూడెం, అస్లాతండా గ్రామాల్లో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. దామోదర్‌రెడ్డి గెలిచిన ప్రతిసారి తుంగతుర్తిలోనే కాకుండా సూర్యాపేటలో కూడా గుండాయిజం, రౌడీయిజం పెచ్చరిల్లిపోయి సామాన్యుడు జీవించే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. పట్టణంలో చిన్న వ్యాపారులు సైతం దామోదర్‌రెడ్డి అనుచరుల దాదాగిరికి బలయ్యారని విమర్శించారు. అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి మరోమారు ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయనగౌడ్, మండలాధ్యక్షుడు తూడి నర్సింహ్మరావు, కొణతం సత్యనారాయణరెడ్డి, లింగానాయక్, శేఖర్‌రెడ్డి, పానుగంటి లలిత, కావ్య, నర్సిరెడ్డి, కానుగ శ్రీనివాస్, ఇంద్రారెడ్డి, ఏడుకొండలు, బెల్లంకొండ ఎల్లయ్య, వీరారెడ్డి పాల్గొన్నారు.