సూర్యాపేట టౌన్, ఆగస్టు 7 : సమైక్య పాలనలో అన్ని విధాలుగా వెనుకబడిన సూర్యాపేట ప్రత్యేక రాష్ట్రమేర్పడిన తొమ్మిదేండ్లలో అన్ని రంగాల అభివృద్ధితో పాటు క్రీడా స్ఫూర్తిలోనూ ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జీజేఆర్ కప్ నియోజకవర్గ స్థాయి ఫైనల్ క్రీడలను సోమవారం తిలకించిన అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం మాట్లాడుతూ పోటీ తత్వంతోనే మేధస్సు మరింత మెరుగుపడుతుందన్నారు. ప్రస్తుత సెల్‌ఫోన్ యుగంలో యువత పెడదోవ పట్టకుంటా అవసరాల మేరకే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు.
ప్రతి ఒక్కరిలో క్రీడా నైపుణ్యం వెలికితీతకు జీజేఆర్ కప్ క్రీడలు నిర్వహించినట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రీడాకారుల ప్రోత్సాహానికి ప్రత్యేక క్రీడా కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. క్రీడలతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతిఒక్కరూ ఖాళీ సమయంలో క్రీడలపై దృష్టి సారించాలన్నారు. అందరిలో క్రీడా స్పూర్తిని పెంపొందించుకోవాలన్నారు. క్రీడాకారులు పోటీల్లో గెలుపోటములు సమానంగా స్వీకరించాలని సూచించారు. అన్ని ప్రాంతాల్లో ఆట స్థలాలు ఏర్పాటు చేసుకుని అంతా క్రీడలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
పేటలో ఇప్పటికే జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించుకున్నామని.. అలాగే అంతర్జాతీయ క్రీడలకు సైతం వేదికగా రూపుదిద్దుకుందామన్నారు. కార్యక్రమానికి ముందుగా మంత్రి జగదీశ్‌రెడ్డి అందరిలో మరింత ఉత్సాహాన్ని నింపుతూ ఆటల పోటీలను తిలకించారు. ఈ సందర్భంగా ఫైనల్ క్రీడలు, కోలాటాల పోటీలు హోరాహోరీగా సాగాయి. కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి తనయుడు గుంటకండ్ల వేమన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, స్థానిక కౌన్సిలర్ తాహెర్ పాషా, పార్టీ పట్టణాధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, నాయకులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, ఉప్పల ఆనంద్, రాపర్తి శ్రీనివాస్ తో పాటు ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ మండలాధ్యక్షులు, పెద్ద ఎత్తున నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.