సూర్యాపేట అర్బన్, ఏప్రిల్ 14 : సూర్యాపేట జిల్లాలోని మత్స్యశాఖలో అవినీతి రాజ్యం ఏలుతోంది. అధికారుల అవినీతికి వ్యతిరేకంగా అనేకమార్లు మత్స్య సహకార సభ్యులు ధర్నాలు, నిరసనలు చేసినా… గతంలో రెండు సార్లు ఏసీబీ దాడులు జరిగి, ఇద్దరు అధికారులను అరెస్టు చేసినా ఆ శాఖ అధికారుల తీరులో మార్పు రావడం లేదు. ఈ శాఖలో ఏ పని చేయాలన్నా డబ్బు సమర్పించుకోవాల్సిందే. తాజా గా నూతన సభ్యత్వాల కోసం ఒక్కొక్కరి నుంచి రూ.40వేలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగైదు నెలలుగా సుమారు వంద మంది నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. డబ్బులు ఇవ్వని వారికి సభ్యత్వం ఇవ్వడం లేదని పలువురు సభ్యులు వాపోతున్నారు.
నూతన సభ్యత్వం కావాలంటే ముడుపులు చెల్లించాల్సిందేనని లేకుంటే సభ్యత్వం ఇచ్చేది లేదంటూ బహిరంగంగానే అడుగుతున్నారు. విచిత్రమేంటంటే మూడు నెలల క్రితం దురాజ్‌పల్లి సమీపంలో వలలు విసరడం, తెప్పలు వేయ డం, ఈత కొట్టడం తదితర నైపుణ్య పరీక్షల పేరుతో కొత్త వారి నుంచి మూడు, జుట్టు భాగాలు(కుటుంబంలో మరొకరికి) ఇవ్వడానికి ఆరు వేలు వసూలు చేయగా అందుకు సంబంధించిన సభ్యత్వం ఇవ్వలేదు.. దానిపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవారు లేరు. నాటి పరీక్షను పక్కన పెట్టి మళ్లీ సభ్యత్వాల పేరిట ప్రతి సభ్యుడి నుంచి రూ. 40వేలు వసూలు చేస్తున్నారు. కొద్ది కాలంగా సుమారు 100 మంది నుంచి రూ. 40లక్షలు వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి, తమకు మాత్రం చాలా తక్కువ ఇస్తున్నారంటూ ఏజెంట్లుగా పెట్టుకున్న వారు అధికారులతో కార్యాలయంలోనే వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. మత్స్యసహకార సంఘం లో సభ్యత్వం కోసం అర్హత కలిగిన మత్స్యకారులకు ఎన్నికల ముందు ఓటు హక్కు కల్పించాలే తప్ప ప్రస్తుతం సభ్యత్వాలు తీసుకునే వారికి సంవత్సరం తరువాతే ఓట హక్కు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నాలుగైదు నెలల్లో జరుగనున్న మత్స్యసహకార సంఘ ఎన్నికల్లో ప్రస్తుతం రూ.40 వేలు ఇచ్చి సభ్వత్వం తీసుకున్న వారికి ఎటువంటి ఓటు హక్కు ఉండదని చెబుతున్నారని, ఓ నూతన సభ్యుడు చెబుతున్నాడు. ఇదిలా ఉంటే అర్హత ఉన్నవారు రూ.40 వేలు ఇవ్వలేమని, సభ్యత్వం అవసరం లేదని వదులుకుంటుండగా కొంతమంది అర్హతలేని ప్రైవేటు ఉద్యోగులు, వ్యా పారుల వద్ద డబ్బు తీసుకొని సభ్యత్వాలు ఇస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వంలో హైదరాబాద్ కేంద్రంగా వేల కోట్ల విలువైన భూములను కబ్జా చేస్తుండటం, ఏ శాఖకు ఆ శాఖ విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతుండటం, వీటిపై నిత్యం విపక్షాలు ఆధారాలతో సహా వెలుగులోకి తెస్తున్నాయి. దీంతో మేమేం తక్కువా అన్నట్లు ప్రభుత్వ పెద్దలు తిమింగిలాలను మింగితే, మేము చేప పిల్లలనైనా మింగొద్దా అంటూ ప్రభుత్వ అధికారులు వక్రమార్గం పడుతున్నారు. దీనికి ఉదాహరణే జిల్లాలోని మత్స్యశాఖ కార్యాలయం. అర్హతను బట్టి ప్రతి సభ్యుడికి ఉచితంగా ఇవ్వాల్సిన సభ్యత్వంపై అవగాహన లేకపోవడంతో కొత్తగా సభ్యత్వం తీసుకోవాలనుకునే అమాయకులైన మత్స్యకారులను దోచుకుంటున్నారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలతో భయపడుతున్న అధికారులు కొంత మంది మత్స్య సహకార సంఘ సభ్యలను ఏజెంట్లుగా పెట్టుకొని వసూళ్లకు తెరలేపారు.