సూర్యాపేట, జూలై 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి..నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పండబెట్టి… రెండున్నరేండ్లలో ఏటేటా పంటలను ఎండబెడుతూ ఈ సారి వంద శాతం ముంచింది. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల తరబడి నీటి చుక్కకు నోచుకోని తాము కేసీఆర్ పుణ్యమా అని ఇంచు భూమి వదలకుండా సాగుచేసి సంతోషంగా ఉన్నాం. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ పీడకలగా మరిచిపోయిన పాత రోజులను, నాటి కష్టాలను మళ్లీ తీసుకొచ్చిందంటూ రైతులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో 2.95 లక్షల ఎకరాలు గోదావరి జలాల కింద ఆయకట్టు ఉండగా ఇప్పటి వరకు 2 వేల ఎకరాలకు మించి నాట్లు పడకపోవడంతో రైతులు శాపనార్థాలు పెడుతున్నారు. ఆరుగాలం కాయకష్టం చేసి జీవనం సాగించే రైతన్న పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో దారుణంగా ఉండేది. సాగుకు నీళ్లు లేక… కరెంటు రాక, సకాలంలో విత్తనాలు, ఎరువులు అందక అత్యంత దయనీయ పరిస్థితి ఉండేది. అన్ని బాధలు, ఇబ్బందుల మధ్య తనకున్న భూమిలో సాగు చేసేందుకు చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి, ఆ భారంతో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు.
రైతు కుటుంబాలు మళ్లీ అప్పు చేస్తే తప్ప ఆత్మహత్య చేసుకున్న రైతు అంత్యక్రియలు నిర్వహించలేని దుస్థితి ఉండే ది. అలాంటి పరిస్థితిలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన అనతి కాలంలోనే రైతన్న కండ్లల్లో వెలుగులు నిండాయి. రైతుల ఆత్మహత్యల వార్తలు మీడియాలో కనిపించకుండా పోయాయి. పధ్నాలుగేళ్ల పాటు ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన కేసీఆర్ తమకు ఏదో చేస్తాడనే ఆశతో అన్ని వర్గాలతో పాటు రైతన్నలు అధికారం కట్టబెడితే పదేండ్ల కాలంలోనే అద్భుతాలు సృష్టించి రైతును రాజుగా చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయం సూర్యాపేట జిల్లాను పరిశీలిస్తే తెలుస్తుంది. జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు పరిధిలో కాల్వల ద్వారా నేరుగా నీళ్లు పారేవి 2.50 లక్షల ఎకరాలు ఉండగా ఆయకట్టు పరిధిలోని చెరువులు, కుంటల కింద మరో 45 వేల ఎకరాలను కలిపి మొత్తం 2.95 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. వ్యవసాయ గణాంకాల ప్రకారం 2017 యాసంగి సీజన్లో జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టులో కేవలం 17,500 ఎకరాల్లో వరి పండగా కాళేశ్వరం జలాలు ప్రారంభం కావడంతో వంద శాతం అంటే 2.95 లక్షల ఎకరాల్లో వరి పండించారంటే మార్పు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుత సీజన్లో ఇప్పటికే రైతాంగం దుక్కులు దున్ని 80 శాతం నాట్లు పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క శాతం కూడా పూర్తి కాలేదు. కన్నెపల్లి పంపుహౌస్ మోటార్లను ఆన్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నా.. లేకుంటే కొద్ది రోజుల పాటు తమకు బాధ్యతలు అప్పగిస్తే రైతాంగానికి నీళ్లందిస్తామని సవాల్ విసురుతున్నా కేవలం కేసీఆర్‌ను బద్నాం చేయాలనే కుట్రతో కాళేశ్వరం కూలిందని కాంగ్రెస్ తప్పుడు ప్రచా రం చేస్తోంది. మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్వయంగా మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వద్దకు వెళ్లి కూలిందన్న బ్యారేజీ ఎలా ఉందో తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి కళ్లకు కట్టినట్లు చూపించారు. కూలిందన్న ప్రాజెక్టును ఆన్ చేసి నీళ్లిస్తే అభాసుపాలవుతామనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోందే తప్ప రైతాంగాన్ని ఆదుకోవాలనే తాపత్రయం ఏమాత్రం లేదు. దీంతో ఈ సీజన్లో సూర్యాపేట జిల్లాలోని 2.95 లక్షల ఎకరాలకు గాను బోర్లు, బావుల కింద కేవలం 2 వేల ఎకరాలకు మించి నాట్లు పడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి జలాలను ఇస్తుందనే నమ్మకం లేక నార్లు కూడా పోయలేదని రైతులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల కోసం ఇంత దారుణానికి పాల్పడుతుందని తాము అనుకోలేదని, రైతులకు ద్రోహం చేసిన ఏ రాజకీయ పార్టీకీ పుట్టగతులు ఉండవని శాపనార్థాలు పెడుతున్నారు. ఇప్పటికైనా స్పందించి నీళ్లివ్వాలని ప్రభుత్వాన్ని రైతులు వేడుకుంటున్నారు.
రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తప్పకుండా తగులుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2022 వానకాలం సీజన్లో వర్షాలు పడకపోవడంతో నాడు మంత్రిగా ఉన్న గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉన్న గాదరి కిశోర్‌కుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కాళేశ్వరం నుంచి పంటలకు నీళ్లు రప్పించారు. ప్రస్తుత సీజన్లో కూడా వర్షాల్లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని ఇవ్వకుండా రైతులను నట్టేట ముంచుతోంది.
నీళ్లియ్యని కాంగ్రెస్ ప్రభుత్వం పాపం పండుద్ది .కాళేశ్వరం కట్టినంకనే మాకు నీళ్లు వచ్చినై. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నీళ్లు రావట్లేదు… మళ్లీ ఓట్ల కోసం వచ్చినప్పుడు రైతుల తడాఖా చూపిస్తం. కాళేశ్వరానికి చివరి ఊరు మాది. మాకు నీళ్లొస్తాయని బీఆర్ఎస్ నాయకులు చెబితే ఇంత దూరం యాడ వస్తయి… అనుకున్నం.. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినంక వరుసగా ఆరేడేండ్లు నీళ్లు వస్తే కడుపునిండా వరి పంట పండించినం. మాయదారి కాంగ్రెస్ వచ్చిన కాణ్నించి నీళ్లు బందైనయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం బంజేసి రైతులను ముంచకుండా నీళ్లిచ్చి రైతులను కాపాడాలె.