తిరుమలగిరి, ఆగస్టు 12 : సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు రోజురోజుకూ తగ్గుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమై రెండున్నర నెలలు దాటినా ఇప్పటి వరకు ఆశించిన వానలు లేక పోవడంతో భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోతోంది. జూన్ నాటికి సగటున 7.54 మీటర్ల లోతులోకి భూగర్భ జలాలు పడిపోయాయి. రెండు సంవత్సరాలతో పోల్చితే భూగర్భ జలాలు దారుణంగా తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఈ ఏడాది 135.7 మిల్లిమీటర్లు వర్షం మాత్రమే నమోదైంది. చిన్నపాటి జల్లులు తప్ప ఎక్కడా అనుకూల వర్షం కురవక పోవడంతో భూగర్భ జలాలు ప్రమాదస్థాయికి పడిపోయే అవకాశం ఉంది. దీనికితోడు రానున్న రోజుల్లో వర్షపాతం తక్కువగానే ఉంటుందన్న వాతారణ శాఖ హెచ్చరికలతో అన్నదాతల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. బోరుబావుల కింద కొద్దిపాటి నాట్లు వేసిన రైతులు బోర్లు ఎండిపోతే తమ పరిస్థితి ఏమిటని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బోర్లలో నీటి ప్రవాహం తగ్గిపోయిందని రైతులు వాపోతున్నారు.
సూర్యాపేట జిల్లాలోని చెరువులు, కుంటల్లో ఇప్పటి వరకు చుక్కనీరు చేరలేదు. జూలైలో కురిసిన కొద్దిపాటి వర్షాలకు మెట్ట పంటల సాగుకే పరిమితమైంది. జిల్లాలోని 23 మండలాల్లో ఓ మోస్తరు వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో ప్రస్తుతం నీటిమట్టం మరింత వేగంగా పడిపోతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ ప్రారం భం కాగానే వర్షాలతో భూగ ర్భ జలాలు పెరుగుతాయి. వర్షాకాలం ముగిసే సమయానికి భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. ప్రస్తుత పరిస్థితి దీనికి విరుద్ధంగా మారింది. వర్షాలు కురవకపోడంతో అధికారులు ఆరుతడి పంటలు వేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
2018 నుంచి 2023 వరకు కేసీఆర్ సీఎంగా ఉన్న కాలంలో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సాగునీరు అందించడంతో జిల్లా వ్యాప్తంగా 500లకుపైగా చెరువులు, కుంటలు నిండి భూగర్భ జలాలు పెరిగి గంగమ్మ పైపైకి రావడంతో 30 గజాల లోతులోనే నీళ్లు అందిన సందర్భాలు చూశాం. ఎక్కడ చూసినా జల సిరులు కనిపించాయి. చెరువులు, కుంటలు, వట్టిపోయిన బోర్లు, ఎండిపోయిన బావులు సైతం అలుగులు పోశాయి. నీరు పుష్కలంగా లభించడంతో రైతులు మూడో పంటగా ఎడగారు పంట కూడా పండించారు. మండె ఎండాకాలంలో సైతం చెరువులు, కుంటలు మత్తడి దూకాయి. నీళ్లు పుష్కలంగా ఉండటంతో వానకాలం సీజన్ కంటే యాసంగి సీజన్లోనే ఎక్కువ వరి సాగు చేసిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటి వ్యవసాయం కత్తిమీదసాములా మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ ఏడాది జూన్ చివరి నాటికి సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లోని మండలాలవారీగా భూగర్భ జలాలు లోతును పరిశీలిస్తే.. తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారంలో 4.54 మీటర్లు, తుంగతుర్తిలో 6.38 మీటర్లు, మద్దరాలలో 6.90 మీటర్లు, జాజిరెడ్డిగూడంలో 9.23 మీటర్లు, నూతనకల్‌లో 10.33 మీటర్లు, తిరుమలగిరిలో 12.85 మీటర్లు, సూర్యాపేట నియోజకవర్గంలోని మోతేలో 5.12 మీటర్లు, చివ్వేంలలో 5.57 మీటర్లు, సూర్యాపేటలో 6.38 మీటర్లు, పెన్‌పహడ్‌లో 7.56 మీటర్లు, ఆత్మకూర్ (ఎస్)లో 9.55 మీటర్లు, హుజూర్నగర్ నియోజకవర్గంలోని గరిడేపల్లిలో 1.52 మీటర్లు, హుజూర్‌నగర్‌లో 2.72 మీటర్లు, నేరేడుచర్లలో 4.42 మీటర్లు, పాలకవీడులో 9.36 మీటర్లు, మఠంపల్లిలో 7.20 మీటర్లు, మేళ్లచెరువులో 13.26 మీటర్లు, చింతలపాలేంలో 14.92 మీటర్లు, కోదాడ నియోజకవర్గంలోని చిలుకూరులో 4.07 మీటర్లు, నడిగూడంలో 5.18 మీటర్లు, మునగాలలో 7.70 మీటర్లు, అనంతగిరిలో 8.38 మీటర్ల లోతు నీటిమట్టం వేగంగా పడిపోతోంది. జిల్లా వ్యాప్తంగా జూన్ నాటికి చింతలపాలేం మండలంలో 14.92 మీటర్ల లోతులో నీటిమట్టం పడిపోయి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రెండో స్థానంలో మేళ్లచెరువు 13.26 మీటర్లు, మూడో స్థానంలో తిరుమలగిరి 12.85 మీటర్లు, నాలుగో స్థానంలో నూతనకల్ 10.38 మీటర్ల లోతులో భూగర్భ జలాలు పడిపోయాయి. సెప్టెంబర్ నాటికి వానకాలం సీజన్ ముగిస్తుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉన్న బోర్లు వట్టిపోయి, పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. దీనికితోడు యాసంగి కూడా ప్రశార్థకంగా మారనుంది. వేసవిలో తాగునీటి కష్టాలు చవిచూడాల్సిన పరిస్థితులు దాపురించనున్నాయి.

జూలై రెండో వారంలో జిల్లా వ్యాప్తంగా 23 మండలాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదు కాకపోవడం.. 20 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరిగి వర్షాలు కురవక రైతులు ఇబ్బంది పడుతున్నారు. మెట్ట పంటలు మళ్లీ వాడిపోతున్నాయి. వారం రోజుల్లో వర్షం పడితే తప్ప మెట్ట పంటలు సైతం చేతికి అందే అవకాశం లేదు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూగర్భ జలాలు పైపైకి వచ్చాయి. సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. కరువు ప్రాంతమైన తుంగతుర్తి, సూర్యాపేట జిల్లాలో పసిడి పంటలు పండాయి. దీనికి ప్రధాన కారణం ఎస్సారెస్పీ కాల్వల ద్వారా రెండు పంటలకు సాగు నీరు అందించడమే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంట లు నింపడంతో జలకళ సంతరించుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏండ్లల్లో భూగర్బ జలాలు అడుగంటి పోయాయి. వర్షపాతం తక్కువగా నమోదైంది. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ లాగా కాల్వల ద్వా రా నీరు అందించక పోవటమే అని రైతు లు విమర్శిస్తున్నారు.
ఈసారి పంటలు చేతికందే సూచనలు కనిపించడం లేదు. అప్పులే మిగిలేటట్లు కనిపిస్తున్నాయి. చెరువులు, కుంటలు ఎండిపాయే.. కాల్వల నీళ్లు రావాయే.. ఆగి.. ఆగి పోసే బోర్లు చివరి వరకు నీళ్లు అందిస్తాయా? లేదా? అర్థం కావడం లేదు. భూమిల జలం మొత్తం పోతోంది. వ్యవసాయం ఎట్లా చేయాలి? రైతులు ఇక వలస పోవాల్సిన దుస్థితి వస్తుంది. ఆలోచిస్తే తెలంగాణ రాక ముందు లాగా భూములు బీళ్లుగా మారే ప్రమాదం ఉంది. ఇకనైనా ప్రభుత్వం ఆలోచించి కొద్ది రోజులైనా కాల్వల ద్వారా నీళ్లు అందించి ఆదుకోవాలి.
కేసీఆర్ సారు ఉన్నప్పుడు రైతులు ఇంత గోస పడలేదు. రైతులకు కష్టాలు రాకుండా చూసిండు. 2016 యాసంగిలో కరువు వస్తే కాల్వల ద్వారా దాదాపు రెండు నెలలు నీళ్లు ఇచ్చి చెరువులు, కుంటలు నింపి రైతులను ఆదుకుండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఏం సక్కగ లేదు. రైతుల గురించే పట్టించుకుంట లేదు. రైతుల కష్టాలు అర్థం అయితలేదు. పంటలు పండకుంటే ప్రజలు ఏమితిని బతుకుతరు. రైతులను ఆదుకోవాలి.
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 2008 నుంచి 2026 వరకు భూగర్బ జలాల తీరు పరిశీలిస్తే.. 2008లో 9.12 మీటర్ల లోతు, 2009లో 9.86 మీటర్లు, 2010లో 10.78 మీటర్లు, 2011లో 8.82 మీటర్లు, 2012లో 13.02 మీటర్లు, 2013లో 9.06 మీటర్లు, 2014లో 12.05 మీటర్లు, 2015లో 12.15 మీటర్లు, 2016లో 11.06 మీటర్లు, 2017లో మీటర్లు, 10.54 మీటర్లు, 2018లో 10.83 మీటర్లు, 2019లో 11.39 మీటర్లు, 2020లో 7.20 మీటర్లు, 2021లో 7.12 మీటర్లు, 2025లో 7.14 మీటర్లు, ప్రస్తుతం 2026లో 7.54 మీటర్ల లోతులో భూగర్బ జలాలున్నాయి.
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గత 11 సంవత్సరాలుగా జూన్‌లో కురిసిన వర్షపాతం నమోదును పరిశీలిస్తే.. 2008-09లో 686.01 మిల్లీమీటర్లు నమోదు కాగా 2009-10లో 530.3 మి.మీ, 2010-11లో 806.4 మి.మీ, 2011-12 లో 438.9 మి.మీ, 2012-13లో 403.13 మి.మీ, 2013-14లో 401.8 మి.మీ, 2016లో 130.06 మి.మీ, 2017లో 149.6 మి.మీ, 2018లో 115.4 మి.మీ, 2019లో 46.4 మి.మీ, ప్రస్తుతం 2026లో జిల్లా వ్యాప్తంగా 135.07 మిల్లీ మీటర్లు నమోదైంది.