న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21 : అరెస్టు చేసే సమయంలో అరెస్టుకు గల కారణాలను లిఖితపూర్వకంగా, ఆ వ్యక్తికి అర్థమయ్యే భాషలో తెలియచేయాలని సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పులో దర్యాప్తు సంస్థలను ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ అతుల్ చందుర్కర్లతో కూడిన ధర్మాసనం ఒక కేసులో తీర్పును వెలువరిస్తూ అరెస్టు చేసిన సమయంలో దర్యాప్తు సంస్థ ఆ వ్యక్తికి అరెస్టుకు గల కారణాలను తప్పనిసరిగా తెలియచేయాలి. అంతేగాకుండా ఆ వివరాలు లిఖితపూర్వకంగా, సదరు వ్యక్తికి అర్థమయ్యే భాషలోనూ ఉండాలి అని పేర్కొంది. రాజ్యాంగంలోని 22(1) అధికరణను ప్రస్తావిస్తూ అరెస్టుకు గల కారణాలను తెలియచేయకుండా ఏ వ్యక్తినీ నిర్బంధించకూడదని, నేర స్వభాగం లేదా తీవ్రతతో సంబంధం లేకుండా ఈ రక్షణ అత్యంత పవిత్రమైనదని న్యాయస్థానం పేర్కొంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(పీఎంఎల్ఏ), అన్‌లాఫుల్ యాక్టివిటీస్(ప్రివెన్షన్) యాక్ట్(యూఏపీఏ) వంటి ప్రత్యేక చట్టాల కింద జరిగే అరెస్టులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
22(1) అధికరణ ఉల్లంఘన కారణంగా విడుదలైన వ్యక్తిని తిరిగి అరెస్టు చేయడానికి సంబంధించి కూడా కోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. పోలీసులు ముందుగా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎదుట దరఖాస్తు సమర్పించి, వారి అనుమతి పొందాలని న్యాయస్థానం పేర్కొంది. మళ్లీ అరెస్టు చేయడానికి దరఖాస్తు దాఖలు చేసే ముందే అరెస్టుకు సంబంధించిన కారణాలను లిఖితపూర్వకంగా అందిచాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే ఆ దరఖాస్తుపై మొదట అరెస్టు చేసిన పోలీసు అధికారికి తక్షణ పైఅధికారి ఆమోదం కూడా ఉండాలని కోర్టు పేర్కొంది. అసలు అరెస్టు సమయంలో అరెస్టుకు గల కారణాలను ఎందుకు తెలియచేయలేదో ఆ దరఖాస్తులో వివరించాలని జస్టిస్ భుయాన్ పేర్కొన్నారు. 22(1) అధికరణను ఉల్లంఘించి ప్రాథమికంగా అరెస్టు చేయడానికి బాధ్యులైన పోలీసు అధికారిపై శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది.