సూర్యాపేట, అక్టోబర్ 10: ‘సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పి రెండేండ్లు కావస్తున్నా ఇప్పటికీ ఒక్క రూపాయి చెల్లించలేదు. మాకు రావాల్సిన రూ.24 వేలు ఎప్పుడు చెల్లిస్తారు’ అని ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కల్నల్ సంతోష్‌బాబు చౌరస్తాలో సూర్యాపేట ఆటో డ్రైవర్ అసోసియేసన్ గౌరవాధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఆటో డ్రైవర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే బీఆర్ఎస్ హయాంలో నాటి సీఎం కేసీఆర్ రూ.5 లక్షల ప్రమాద బీమా ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రమాదబీమాను రెన్యూవల్ చేయలేదన్నారు. రాస్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 93 మంది ఆటో డ్రైవర్లు మరణిస్తే వారికి ఎలాంటి బీమా సౌకర్యం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు.
కనీసం పిల్లల ఫీజులు కట్టుకోలేక కుటుంబం గడవక ఎంతో మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకపోతే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.