– మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు
మిర్యాలగూడ, ఫిబ్రవరి 05 : గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించాలని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని 14, 33, 34, 35, 45వ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల పక్షాన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో మిర్యాలగూడ పట్టణంలో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులను నిర్వహించడం జరిగిందన్నారు. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా మిర్యాలగూడ పట్టణానికి ఇన్ని నిధులు తీసుకురాలేదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు, కూలీలు అన్ని వర్గాల వారు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా నిరుద్యోగులు ఉద్యోగాలు రాక అవస్థలు పడుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో పింఛన్లు పెంచుతామని, కల్యాణ లక్ష్మి డబ్బులతో పాటు తులం బంగారం ఇస్తామని, ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తామని ఇలా అనేక రకాలు హామీలు ఇచ్చి నేడు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్పాలని కోరారు. గతంలో చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభ్యర్థులు పాల్గొన్నారు.