సూర్యాపేట, జూలై 14 (నమస్తే తెలంగాణ) : పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా సరఫరా అవుతున్న బియ్యంపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. దువ్వ, ధూళితోపాటు 60 శాతం రంగు మారిన బియ్యం ఉంటున్నాయి. దీంతో నిత్యం డీలర్లు, లబ్ధిదారుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల చివ్వెంల గోదాం వద్ద దువ్వ లేస్తున్నందున ఆరోగ్యాలు పాడవుతాయని తాము బియ్యం లారీల్లోకి ఎత్తలేమని హమాలీలు కరాఖండిగా చెప్పారు. వెంటనే అధికారులు వచ్చి ఇక మీదట మంచి బియ్యం వచ్చేలా చర్యలు చేపడుతామని నచ్చజెప్పి లిఫ్ట్ చేయించారు. రెండు నెలలుగా సూర్యాపేట డివిజన్ పరిధిలో పాడైన బియ్యం సరఫరా అవుతున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేదోళ్లకు ఇచ్చే రేషన్ బియ్యం మక్కిపోయి, రంగ మారి వస్తున్నాయి. వాస్తవానికి పదేండ్ల క్రితం వరకు రేషన్ బియ్యం బాగాలేవంటూ నిత్యం డీలర్లు, లబ్ధిదారుల మధ్య వాగ్వాదాలు జరిగేవి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ.. కొద్ది రోజులుగా మళ్లీ పాత రోజులే పునరావృతం అవుతున్నాయి. ఎక్కడి నుంచి బియ్యం సరఫరా చేస్తున్నారో కానీ.. వాటిని చూస్తేనే ఆకలి చచ్చిపోతుందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇటువంటివి ప్రధానంగా సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాల్లోనే సరఫరా అవుతున్నాయి. ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని రేషన్ బియ్యం గోదాం నుంచి తాము బియ్యం తీసుకోమని కొంత మంది డీలర్లు చెప్పేశారట. దుమ్ము, ధూళి, దువ్వతోపాటు దాదాపు 60 శాతం బియ్యం మక్కిపోయి, రంగు మారి వస్తున్నాయని తీసుకునేందుకు అయిష్టత చూపారు. వారం క్రితం చివ్వెంల పాయింట్ వద్ద బియ్యం బస్తాల నుంచి విపరీతంగా దుమ్ము, ధూళి వస్తున్నదని తమ ఆరోగ్యాలు పాడవుతాయని బస్తాలను లారీల్లోకి ఎత్తేందుకు హమాలీలు నిరాకరించారు. ఈ రెండు సంఘటనల్లోనూ పౌరసరఫరాల శాఖ అధికారులు రంగంలోకి దిగి తుంగతుర్తిలో డీలర్లకు, చివ్వెంలలో హమాలీలకు నచ్చజెప్పి మరోసారి ఇలాంటి బియ్యం రాకుండా చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. అంతేకాదు.. హమాలీలు, డీలర్లు మాస్క్లు ధరించి బియ్యం పంపిణీ చేయాలని అధికారులు సూచించినట్లు తెలిసింది. మరి అంత దారుణంగా ఉన్న బియ్యాన్ని నిరుపేదలు ఎలా తింటారో అధికారులు ఆలోచించకపోవడం శోచనీయం. వచ్చే నెల నుంచి కాదు.. ఇప్పటికిప్పుడు మక్కిన బియ్యాన్ని వెనక్కు పంపించి మంచి బియ్యం సరఫరా చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
నాకు తెల్లరేషన్ కార్డు ఉంది. మా కుటుంబానికి ప్రతి నెలా 35కిలోల రేషన్ బియ్యం వస్తున్నాయి. మేము ఆ బియ్యాన్నే వండుకొని తింటాం. అయితే.. కొన్ని నెలలుగా ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యం ముక్క వాసనతోపాటు నల్లగా వస్తున్నాయి. ఎన్ని మార్లు కడిగినా వాసన పోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం మంచిగా ఉండేవి. ఇప్పుడు ముక్కిన, రంగుమారిన బియ్యం వస్తుండడంతో మాలాంటి పేదలు అన్నం వండుకోలేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ విషయమై డీలర్లను అడిగితే ప్రభుత్వం ఏవి పంపితే అవే ఇస్తామని ముక్కబెట్టి ఇవ్వాల్సిన అవసరం మాకేందని అంటున్నారు. ఇలాంటి బియ్యం ఎందుకు వస్తున్నాయో అధికారులు విచారణ చేసి నాణ్యమైన బియ్యం అందేలా చూడాలి.