నల్లగొండ, జనవరి 07 : అమ్మాయిలు ధైర్యంగా ముందుకు సాగాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్, నల్లగొండ మండల ప్రత్యేకాధికారి రమేశ్, డాక్టర్ అనితారాణి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీసీ బాలికల కళాశాల హాస్టల్ నందు నిర్వహించిన సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. జీవితంలో రాణించాలంటే మంచి లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని ముందుకు పోవాలన్నారు. మానసికంగా ధృఢంగా ఉండాలని ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు జీవితకాల దుఃఖాన్ని మిగిల్చవద్దన్నారు. చదువులో అనుకున్న లక్ష్యాలను సాధించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి సంజీవ, సైకాలజిస్ట్ అనిల్, హెచ్డబ్ల్యూఓఎస్ జిల్లా అధ్యక్షుడు రణదీవే, జీఏఎఫ్ అధ్యక్షుడు దూసరి కిరణ్ గౌడ్, హెచ్డబ్ల్యూఓఎస్ కమల, మంగమ్మ, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.