ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం భారీ ఈదురు గాలులు, వర్షం బీభత్సం సృష్టించాయి. దీంతో పలు ప్రాంతాల్లోని నీట పాలైంది. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆరబోసిన ధాన్యం వర్షంతో తడిసింది. అలాగే తిరుమలగిరి ఐకేపీ కేంద్రంలో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసింది. అలాగే కేతేపల్లి మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యపు రాసులు తడిసి ముద్దయ్యాయి. ఈదురు గాలులకు కొన్ని గ్రామాల్లో చెట్లు నేలకొరిగాయి. మామిడి, నిమ్మ ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పెన్‌పహాడ్, మండలంలో రెండు గంటల పాటు భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో మండలంలోని అనంతారంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ధాన్యపు రాశులు దెబ్బతిన్నాయి. ఈదురు గాలులకు చెట్లు నెలకొరిగాయి. కరెంట్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
సూర్యాపేట, మే 3 : సూర్యాపేటలో ఆదివారం సాయం త్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి, సుమారు గంట పాటు వేగంగా వీచిన ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. తేలిక పాటి వర్షం పడటంతో జనం కొంత ఉపశమనం పొందారు. పలు చోట్ల ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన రైతుల ధాన్యం తడిసింది.
మాడ్గులపల్లి, మే 3: మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షానికి పలు గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తెచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. లారీలు రావడం లేదని కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేశారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. కాగా గాలి దుమారానికి కొత్తగూడెం ఎఫ్‌సీఐ గోదాంలోని రేకులు పగిలిపోయాయి.
గుడిపల్లి, మే 3 : మండల కేంద్రమైన గుడిపల్లిలో ఆదివారం సాయంత్రం భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో సీసీఐ ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతులు తెచ్చిన ధాన్యం తడిసింది. భారీ ఈదురు గాలులకు పట్టాలు లేచిపోవడంతో ధాన్యం తడిసిందని ఈ సందర్భంగా రైతులు పేర్కొన్నారు.
తిరుమలగిరి మే 3 : తిరుమలగిరిలో ఆదివారం వర్షంతో రైతులు ఐకేపీలో పోసిన ధాన్యం తడిసి అన్నదాతలు అవస్థలు పడ్డారు. మాలీపురం ,మోత్కూర్ ,జనగాం రోడ్డులో పోసిన ఐకేపీ కేంద్రాలో ధాన్యం వర్షానికి తడిసింది.
మఠంపల్లి, మే 3 : మఠంపల్లి మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ ఈదురుగాలులు వర్షానికి పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. ఇటీవల తీస్తున్న ఎండలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనానికి కొంత మేర ఉపశమనం లభించింది.
నేరేడుచర్ల ,మే 3 : నేరేడుచర్ల పట్టణంలో, మండలంలో ఆదివారం సాయంత్రం ఊహించని విధంగా ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుములు,మెరుపులు ,ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.
శాలిగౌరారం, మే 3 : అకాల వర్షానికి శాలిగౌరారం మండలంలో అపార నష్టం వాటిల్లింది. ఆదివారం సాయంత్రం మండలంలో భారీ గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని రైతుల ధాన్యం రాశులు తడిసిపోయాయి. ఊట్కూరులోని కొనుగోలు కేంద్రంలో రాశుల మధ్య వర్షపు నీళ్ళు నిలిచాయి. అదేవిధంగా పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి పోయాయి. గంటల పాటు విద్యుత్తు సరఫరా స్తంభించింది.
కేతేపల్లి, మే 3 : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఆదివారం ఈదురు గాలులు, భారీ వర్షం బీభత్సం సృష్టించాయి. మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో విలవిలలాడిన జనం ఒక్కసారిగా భారీ ఈదురు గాలులతో వర్షం కురవడంతో భయభ్రాంతులకు గురయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యపు రాసులు తడిసి ముద్దయ్యాయి. ధాన్యపు రాసులపై కప్పి ఉంచిన టార్పాలిన్లు గాలికి లేచిపోయాయి. కొన్ని కేంద్రాల్లో కాంటాలు వేసిన ధాన్యం బస్తాలు వర్షానికి తడిశాయి. ఈదురు గాలులకు కొన్ని గ్రామాల్లో చెట్లు నేలకొరిగాయి. మామిడి, నిమ్మ ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
త్రిపురారం, మే 3: మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షం, గాలి బీభత్సంతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. త్రిపురారం పీఏసీఎస్, ఐకేపీ కేంద్రాల్లో సుమారు 1500 బస్తాలు తడిసిపోయాయని రైతులు శ్యాంసుందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, మధుమోహన్, వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. గాలి బీభత్సంతో గ్రామాల్లో విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి.
పెన్‌పహాడ్, మే 3 : మండలంలో ఆదివారం సాయంత్రం గాలి వాన బీభత్సం సుష్టించింది. సుమారు రెండు గంటల పాటు భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో మండలంలోని అనంతారంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ధాన్యపు రాశులు దెబ్బతిన్నాయి. ఈదురు గాలులకు చెట్లు నెలకొరిగాయి. కరెంట్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
చండూరు, మే 3 : చండూరు మండలంలో ఆదివారం మోస్తారు వర్షం పడింది. మండల పరిధిలోని తుమ్మపల్లి, బోడంగిపర్తి గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం కొద్దిసేపు వర్షం పడటంతో ఐకేపీ కేంద్రం వద్ద రైతులు కుప్పులుగా పోసిన ధాన్యం తడిసింది. ధాన్యం కుప్పల చుట్టూ వర్షపు నీరు నిలవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. పుల్లెంల ఐకేపీ సెంటర్ చుట్టుపక్కల ఉన్న మూడు, నాలుగు గ్రామాల రైతులు సుమారు 20 రోజుల క్రితం ధాన్యాన్ని తెచ్చి ఇక్కడ ఎండబెట్టారు. కావాల్సిన మ్యాచర్ వచ్చినా కాంట్రాక్టర్లు లారీలను సరఫరా చేయకపోవడంతో సుమారు 40 మంది రైతులకు చెందిన 30 లారీల ధాన్యం అక్కడే ఉంది. దీంతో వర్షం పడిన కొంతసేపటికే ధాన్యం తడిసింది. మ్యాచర్ వచ్చినా ధాన్యం ఎత్తకపోవడంతో వర్షం పడి ధాన్యం తడిసిందని, మ్యాచర్ వచ్చే వరకు మళ్లీ ఇక్కడే ఎండబెట్టి పడిగాపులుగాయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.