నేరేడుచర్ల, నవంబర్ 17 : ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు అందజేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకం అభాసుపాలవుతోంది. ప్రభుత్వ లక్ష్యం మంచిదైనప్పటికీ రేషన్ షాపులకు బియ్యం పంపిణీ చేసే కాంట్రాక్టర్ల కక్కుర్తి, అధికారుల పర్యవేక్షణా లోపం కారణంగా నాణ్యమైన బియ్యం సరఫరా కావడం లేదు. బూజు, పురుగులతో కూడిన బియ్యాన్ని రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. దీనికి తోడు 50 కేజీల బస్తాలో రెండు మూడు కిలోల తరుగు ఉం టోంది. వచ్చిన సన్న బియ్యాన్ని డీలర్లు తెల్లరేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. వాటిని తీసుకెళ్లిన లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని బక్కయ్యగూడెం రేషన్ దుకాణానికి నవంబర్ నెల కోటా కింద సరఫరా చేసిన బియ్యం బస్తాల్లో చాలా వరకు పురుగులు, బూజుతో కూడిన నాణ్యత లేని బియ్యం ఉన్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు.
వాటిని తీసుకెళ్లిన లబ్ధిదారులు డీలర్లతో గొడవకు దిగుతున్నారు. గ్రామానికి చెందిన శా నం సాయినాథ్ శనివారం తీసుకెళ్లిన రేషన్ బియ్యంలో మొత్తం పురుగులే ఉన్నాయి. దీంతో చేసేదేమీ లేక మరో బియ్యం బస్తా తీసి చూస్తే దానిలో కూడా అదే పరిస్థితి ఉంది. నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండటం లేదు. దీంతో చేసేదేమీ లేక ప్రభుత్వ సరఫరా చేస్తున్న పురుగులతో కూడిన సన్న బియ్యాన్నే పంపిణీ చేస్తున్నారు. ఈ విధంగా నాసిరకం బియ్యం రేష న్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తే లబ్ధిదారులకు రేషన్ దుకాణాలపై నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారు లు స్పందించి నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేలా చూడాలని లబ్ధిదారులు, గ్రామస్తులు కోరుతున్నారు.
రేషన్ దుకాణాలకు సరఫరా చేసే బియ్యం బస్తాల్లో నాణ్యతా లోపంతో పాటు ప్రతి 50 కేజీల బస్తాలో రెండు, మూడు కేజీలు తరు గు వస్తున్నాయి. ఈ విషయాన్ని రేషన్ డీల ర్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదు. దీనికి తోడు సన్న బియ్యం నాసిరకంగా ఉంటోంది. ప్రభుత్వం నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేయాలని హెచ్చరికలు జారీచేస్తున్నా కాంట్రాక్టర్లు వారి ఆదేశాలను పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై డీలర్ కోణ సత్యంను వివరణ కోరగా ప్రభుత్వం నుంచి వచ్చిన బియ్యాన్నే లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. న వంబర్ నెలలో సరఫరా చేసిన బియ్యంలో చాలా వరకు ఇలాంటివే ఉన్నాయి. తమ వద్ద ఎలాంటి తప్పు జరగలేదని తెలిపారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నాణ్యమైన సన్న బియ్యం సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం. అదే విధంగా కొన్ని బస్తాల్లో తూకం విషయంలో తేడా ఉంటోందని రేషన్ డీలర్లు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ ఆవిషయాన్ని ఉన్నతాధికారులకు వివరించి సమస్య తలెత్తకుండా చూస్తాం.
– సురిగి సైదులు, నేరేడుచర్ల తాసీల్దార్