కులవృత్తులకు రాష్ట్ర సర్కారు ఊతమిస్తున్నది. గొల్ల కురుమల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. జీవనోపాధి కల్పించేలా చేయూతనందిస్తూ.. ఎలమంద మురిసేలా ఆర్థికంగా ఆదుకుంటున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా సబ్సిడీ గొర్రెల పథకానికి శ్రీకారం చుట్టి గొల్ల కురుమలను సొంత కాళ్లపై నిలబెడుతున్నది. సర్కారు తోడుతో ఏటా గొర్రెల మంద పెరిగిపోతుండడంతో గొల్లకురుమల కుటుంబాలు మంచి ఆదాయం ఆర్జిస్తున్నాయి. ప్రభుత్వం 75శాతం సబ్సిడీతో గొర్రెల యూనిట్ ఇవ్వడంతో పాటు జీవాలకు ఇన్సూరెన్స్, రవాణా, ఫీడింగ్ సౌకర్యాలు కూడా కల్పిస్తున్నది. మరోవైపు ధరలు పెరిగిపోతుండడంతో యూనిట్ ఖర్చును రూ.1.75లక్షలకు పెంచింది. మునుగోడు నియోజకవర్గంలో రెండు విడుతల్లో కలిపి 12,611 యూనిట్లు అందించింది. ఈ క్రమంలో తమను ఆదుకున్న కారు పార్టీకే మునుగోడు ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని గొల్లకురుమలు తెలియజేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : గొల్లకురుమలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని, మాంసం ఎగుమతుల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2017లో గొర్రెల సబ్సిడీ పథకానికి శ్రీకారం చుట్ట్టింది. ఈ పథకం కింద సర్కారు 75శాతం సబ్సిడీ అందిస్తున్నది. ఒక్కో యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందిస్తుండగా.. యూనిట్ ఖర్చు రూ.1.25లక్షలుగా నిర్ణయించారు. ఇందులో లబ్ధిదారుడు తన వాటా కింద రూ.43,250 డీడీ తీయాలి. ప్రభుత్వం 1,31,750 సబ్సిడీ ఇస్తుండగా.. ఇప్పటికే మొదటి విడుత పంపిణీ పూర్తయింది.
యూనిట్ ఖర్చు 1.75లక్షలకు పెంపు..
సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం అమల్లోకి వచ్చి ఐదేండ్లు అవుతుండగా.. ధరల్లో అప్పటికీ, ఇప్పటికి వ్యత్యాసం ఉంది. గొర్రె పిల్లల ధరలు పెరిగిపోయాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ ఖర్చును పెంచింది. ఇప్పటి వరకు ఉన్న 1.25లక్షల యూనిట్ ఖర్చును రూ.1.75లక్షలకు పెంచింది. మొత్తం యూనిట్ ఖర్చులో లబ్ధిదారుడు రూ.43,250 చెల్లించాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుతం 1,31,750 రూపాయలు చెల్లిస్తున్నది. గతంలో లబ్ధిదారుడు డీడీల రూపంలో డబ్బులు చెల్లించాల్సి ఉండగా.. వస్తున్న ఇబ్బందుల నేపథ్యంలో అధికారులు ‘ఈ-లాభ్’ పోర్టల్‌లో వివరాలు రిజిస్టర్ చేశారు.
ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా..
రాష్ట్ర ప్రభుత్వం కేవలం గొర్లు ఇచ్చి చేతులు దులుపేసుకోలేదు. వారు ఆర్థికంగా నిలదొక్కుకునే వరకూ అండగా ఉంటున్నది. సర్కారు ఇచ్చిన గొర్రెల్లో ఏదైనా చనిపోతే దానికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించింది. చనిపోయిన గొర్రె పిల్ల స్థానంలో మరొకటి కొనిస్తున్నది. ఇందుకోసం 5,600 రూపాయలు ఇస్తున్నది. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చే గొర్రె పిల్లలకు రవాణా చార్జీలను కూడా ప్రభుత్వమే భరిస్తున్నది. అంతేకాకుండా గొర్రెల కోసం మెడిసిన్ కిట్ అందిస్తూ.. గొర్రెల ఫీడింగ్ ఫెసిలిటీ కల్పిస్తున్నది.
12,661 యూనిట్ల పంపిణీ
మునుగోడు నియోజకవర్గంలో గొర్రెల సబ్సిడీ పథకం విజయవంతంగా అమలవుతున్నది. మొత్తంగా ఇప్పటి వరకు రూ.166 కోట్లతో 12,661 యూనిట్లను పంపిణీ చేసింది. మొదటి విడుతలో 5,061 మందికి గొర్రెలు అందించగా. రెండో విడుత కింద ఇటీవల 7600 యూనిట్లకు నిధులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి డబ్బును సర్కారు నగదు రూపంలో పంపిణీ చేసింది. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.93 కోట్లు జమ చేసింది. ఈ డబ్బుతో గొల్లకురుమలకు గొర్రెలను కొనుగోలు చేసి ఇవ్వనున్నది. ఇక నల్లగొండ జిల్లాలో మొదటి విడుతలో 16వేల యూనిట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 16వేల యూనిట్ల చొప్పున పంపిణీ చేయగా, రెండో విడుత కూడా అంతే మందికి ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
మంద డబుల్.. ట్రిపుల్
సబ్సిడీ గొర్రెలతో గొల్ల కురుమలకు ఎంతో మేలు జరుగుతున్నది. కుటుంబానికి జీవనోపాధి కలుగుతున్నది. ఆర్థికంగా సాయం అందుతున్నది. 16 నుంచి 18 నెలలకు గొర్రెలు ఈనుతుండటంతో ఎప్పటికప్పుడు మంద పెరిగిపోతున్నది. అనేక మంది ఇండ్లల్లో మంద డబుల్, ట్రిపుల్ అయ్యింది. కొన్ని చోట్ల 80 నుంచి 100దాకా జీవాలు కనిపిస్తున్నాయి. పొట్టేళ్లను అమ్ముకుని ఆర్థికంగా లాభాలు గడిస్తున్నారు. మరోవైపు గొర్రెల ఉన్నితో ఆదాయం పొందుతున్నారు.
టీఆర్ఎస్కు జై కొడుతున్న గొల్లకురుమలు..
మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 14వేల గొల్లకురుమల కుటుంబాలు ఉండగా, 45వేల వరకు ఓట్లు ఉన్నాయి. వారంతా ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే జై కొడుతున్నారు. ఇప్పటికే ఆయా కుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. సీఎం కేసీఆర్ గొర్రెల పథకమే కాకుండా అనేక స్కీమ్‌లు అమలు చేస్తున్నారని, ఆయనకు మద్దతుగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తామని శపథం చేస్తున్నారు.
ఇంకా ఎన్నో కార్యక్రమాలు..
సబ్సిడీ గొర్రెలు అందిస్తున్న సర్కారు.. జీవాల సంరక్షణకూ ఎన్నో చర్యలు తీసుకుంటున్నది. ఉమ్మడి రాష్ట్రంలో నట్టల నివారణ మందు ఏడాదికి ఒకటి, రెండు సార్లు మాత్రమే వేసేవారు. కానీ.. ఇప్పుడు ఏడాదిలో మూడు సార్లు పంపిణీ చేస్తున్నారు. గొర్రెలకు ఆరు రకాల వ్యాక్సిన్లు వేస్తున్నది. మూగజీవాల కోసం నియోజకవర్గానికి ఒక అంబులెన్స్ సౌకర్యం కల్పించింది. ఇందుకోసం 1562 అనే నంబర్‌ను అందుబాటులో ఉంచింది. మండలానికో వెటర్నరీ హాస్పిటల్‌ను ఏర్పాటు చేసి, పశు వైద్యులను అందుబాటులో ఉంచుతున్నది.
మంచి చేస్తున్న టీఆర్ఎస్నే గెలిపిస్తం
గొల్లకురుమలను టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగ చూసుకుంటున్నది. ఇంతకు ముందు వచ్చినవాళ్లు గొల్ల కురుమల దిక్కు కూడా చూడలే. సీఎం కేసీఆర్ మాకు గొర్రెలు ఇచ్చిండు. రైతుబంధు వస్తున్నది. గొర్రెలకు రోగాలు రాకుండా మంద దగ్గరకు వచ్చి మందులు వేస్తుండ్రు. ఇంత మంచి చేస్తున్న టీఆర్ఎస్నే గెలిపిస్తం.
– గగనబోయిన నర్సింహ, ఆరెగూడెం(చౌటుప్పల్ రూరల్)
మాకు, మామయ్యకు గొర్లొచ్చినయి..
మాకు, మామయ్య (చివర్ల నరసింహ)కు 40 గొర్రెలు, 2పొట్టేళ్లు వచ్చినయ్. మాకున్న పొలంలో సాగు చేస్తూ, ప్రభుత్వం గొర్రెలతో బతుకుతున్నం. గొర్రెల పెంపకం మా వృత్తి. కేసీఆర్ ఇచ్చిన గొర్రెలు మా కుటుంబానికి ఎంతో అండగా ఉన్నాయి. ఆయన ఇచ్చిన గొర్రెలు పెంచుకోవడంతో మేము ఆర్థికంగా స్థిరపడుతున్నం. మంద బాగా పెరిగి గొర్రెలను అమ్ముకుంటుంటే పైసలు వస్తున్నయ్. జీవాలతో అనేక మందికి మేలు అయితున్నది.
– శివర్ల రాధ, నేరేళ్లపల్లి, నాంపల్లి మండలం
కేసీఆర్‌తోని యాదవులు ఎదుగుదల
కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక మా యాదవులకు గొర్లనిచ్చిండు. గొర్రెలు కూడా బాగా పెరుగుతున్నయి. యాదవులు ఎదుగుతున్నరు. పైసలు అవసరం ఉన్నప్పుడల్లా పుట్టిన గొర్రె పిల్లను అమ్ముకోవడంతో డబ్బులు వస్తున్నయి. కేసీఆర్ దేవుడు. మా ఓటు కారు గుర్తుకే. మల్లమల్ల గెలుస్తాడు కేసీఆర్.
– దోటి ముత్యాలు, చండూరు
మంచిగా చూసుకుంటున్నడు..
గతంలో ఏ ప్రభుత్వాలూ పట్టించుకోలేదు. కానీ, సీఎం కేసీఆర్ మా గొల్ల కురుమలను మంచిగా చూసుకుంటున్నడు. పెంచుకునేందుకు గొర్రెలు ఇచ్చి, అండగా ఉంటున్నడు. నాకు మొదటి విడుతలోనే గొర్రెలు వచ్చినయి. వాటితో లాభం కూడా వచ్చింది. అప్పుడు రానోళ్లకు ఇప్పుడు అమౌంట్ అకౌంట్లలో జమ చేస్తుండ్రు. ఇది మంచి పరిణామం. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని గట్టిగా నమ్మొచ్చు.
– జమ్మి నరసింహ, గుజ్జ గ్రామం(సంస్థాన్ నారాయణపురం)
ఇంటికి పెద్దన్నగా ఉన్నారు..
మాది పసునూరు. మా గొల్ల కుర్మలకు సీఎం కేసీఆర్ గొర్రెలను ఇచ్చిండు. రూ.1.58లక్షలు అకౌంట్లో వేశారు. మేము గొర్లు కొంటాం. మాలాంటి పేద కుటుంబాలకు ఒక ఇంటి పెద్దన్నగా అండగా ఉన్నరు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొప్పగొప్ప పథకాలను చూసి మేము కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తం.
– ఎడ్ల ముత్యాలు, పసునూరి గ్రామం, నాంపల్లి
కేసీఆర్ మాకు కామధేనువు..
స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఈ రాష్ర్టాన్ని పరిపాలించిన ఏ ప్రభుత్వాలు కూడా మా గొల్లకురుమ వర్గాలకు ఆర్థిక భరోసా ఇవ్వలేదు. కానీ, తెలంగాణ సర్కారు ఏర్పడినంక, ముఖ్యమంత్రి కేసీఆర్ అట్టడుగు వర్గాల కోసం అనేక పథకాలను తెచ్చారు. గొల్ల కురుమలకు గొర్రెల యూనిట్ పథకాన్ని ప్రవేశపెట్టి అర్హులైన వారికి పంచారు. మేము కేసీఆర్‌ను కామధేనువుగా భావిస్తున్నాం. రెండో విడుత యూనిట్లో నాకు గొర్రెల యూనిట్ వచ్చింది. మేం టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటాం. నా ఓటు కారు గుర్తుకే.
– జిట్టగోని సైదులు, రత్తిపల్లి, మునుగోడు
టీఆర్ఎస్కు మద్దతిచ్చి కారును గెలిపిస్తం..
దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ మంచి మనుసుతో సబ్సిడీ గొర్రెల పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం అమలుతో గొల్ల కురుమలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. మంద రెట్టింపు, మూడింతలు అవుతున్నది. దాంతో గొల్లకురుమలు ఆదాయం కూడా పొందుతున్నరు. గత పాలకులు గొల్ల కురుమలను కనీసం పట్టించుకోలేదు. గొల్ల కురుమలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఉపఎన్నికలో గొల్ల కురుమల ఓట్లన్నీ గుండుగుత్తగా కారు గుర్తుకే వేస్తం.
– దూదిమెట్ల బాలరాజు యాదవ్, తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్