భువనగిరి అర్బన్, మే 8 : భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో దరఖాస్తులు చేసుకున్న అర్హులైన పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కోరుతూ గురువారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ కొండల్ రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూం ఇండ్లను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారన్నారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీ సభ్యులు అని, కాంగ్రెస్ కార్యకర్తలను పెట్టి వారు నిర్ణయించిన పేర్లనే ఫైనల్ చేయడంతో నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. వీటి మీద ఎంక్వయిరీ చేసి అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు గత ప్రభుత్వంలో నెలవారీగా జీతాలు అందేవని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో గత రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఏవీ కిరణ్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు ఖాజా అజీముద్దీన్, దిడ్డికాడి భగత్, తుమ్మల పాండు, తాడూరు భిక్షపతి, తాడేం రాజశేఖర్, వెల్దుర్తి రఘునందన్, ఎనబోయిన జహంగీర్, బర్రె రమేశ్, కాజం, అంజద్, రహీం, సురేశ్, నాగరాజు, సత్యనారాయణ, ప్రవీణ్, మనీష్, ఆకాశ్, గణేశ్, నరసింహారెడ్డి, మల్లేశ్ పాల్గొన్నారు.