– బిల్లులు పాసై 15 రోజులైనా డబ్బులు చెల్లించని కాంట్రాక్టర్
– అప్పుల ఒత్తిళ్లు తాళ్లలేక పురుగుల మందు తాగిన రాజు
నీలగిరి, జూన్ 10 : కాంట్రాక్టర్ వేధింపుల తాళలేక సబ్ కాంట్రాక్టర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం నల్లగొండ పట్టణంలోని పానగల్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం సబ్ కాంట్రాక్టర్ ప్రాణాప్రాయస్థితిలో నల్లగొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. పానగల్ ప్రాంతానికి చెందిన అలకుంట్ల రాజు అనే వ్యక్తి ఓర్సు పాండు అనే కాంట్రాక్టర్ వద్ద గత 10 సంవత్సరాలకు పైగా గుమాస్తాగా పని చేశాడు. ఈ క్రమంలో ఓర్సు పాండుకు అదే ప్రాంతానికి చెందిన యాట సత్తిరెడ్డి అనే వ్యక్తులకు మధ్య గతంలో లావాదేవిల విషయంలో పంచాయతీలు జరిగి పోలీసు కేసుల వరకు వెళ్లారు. ఈక్రమంలో రాజు ఆ పంచాయతీల్లో సాక్షిగా ఉన్నాడు. గత కొన్ని రోజుల క్రితం ఆర్అండ్ బీ శాఖ నుండి ఓర్సు పాండుకు రోడ్డు పనులు మంజూరు కావడంతో అతని వద్ద పనిచేసిన అలకుంట్ల రాజు సబ్ కాంట్రాక్టు తీసుకుని రూ.10 లక్షల పనులు చేయించాడు. వాటికి సంబంధించిన డబ్బులు గత 15 రోజుల క్రితం బిల్లులు పాసై పాండు అకౌంట్లో జమ అయ్యాయి.
అట్టి పనులకు సంబంధించిన వ్యక్తులు డబ్బులు అడుగుతున్నారని, దీంతో పాటు అప్పులు ఇచ్చిన వారు కూడా డబ్బులు కావాలని అడుగుతున్నారని పాండును రాజు డబ్బులు ఇవ్వాలని కోరాడు. కానీ పంచాయతీలో సాక్ష్యం ఉన్నందున తనకు అనుకూలంగా చెప్పాలని డబ్బులు ఇస్తే నీవు చెప్పుతావో లేదో నాకు ఎట్లా అంటూ తిరకాసు పెట్టాడు. ఏదైనా భూములు, ప్లాట్లు జమానతగా పెట్టాలని, లేదంటే అవి ఉన్న వ్యక్తుల చేత జమానత్ పెట్టించాలని షరతు పెట్టాడు. 10 సంవత్సరాలు పని చేసిన నీవే నమ్మకుంటే ఇతరులు ఎలా నమ్ముతారని ప్రశ్నించాడు. తనకు అందతా తెలియదని డబ్బులు ఇవ్వాలంటే తన షరతులకు ఒప్పుకోవాలని, కేసు పూర్తి అయ్యేవరకు డబ్బులు ఇవ్వనంటూ పేచి పెట్టాడు. ఒకవైపు వచ్చిన డబ్బులు ఇవ్వకపోనూ మరోవైపు అప్పులు ఇచ్చిన వ్యక్తులు ఇబ్బందులు పెట్టడంతో తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లగొండ టూటౌన్ ఎస్ఐ వై.సైదులు విచారణ చేపట్టారు.