రామగిరి, జూన్ 26 : విద్యార్థులు స్ధిరమైన లక్ష్యంతో ప్రణాళికాయుతంగా చదివి జీవితంలో స్థిరపడాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ, 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం వర్సిటీలో విద్యార్థులకు నిర్వహించిన పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కార్యక్రమ ప్రారంభానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 21వ సెంచరీ అకాడమి రాబోయే మూడు సంవత్సరాల పాటు విద్యార్థులకు అందించే పోటీ పరీక్షల ఎంవోఓ ఒప్పంద ప్రతాలను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి, అకాడమి వ్యవస్థాపక చైర్మన్ కృష్ణ్రపదీప్ పరస్పరం మార్చుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చంచల స్వభావాన్ని వీడి స్పష్టమైన అవగాహన, సమయ పాలన, నిరంతర శ్రమతో విజయాలు అందుకోవాలని సూచించారు.
అవాంతరాలను అధిగమిస్తూ నిర్మాణాత్మక ఆలోచన విధానాన్ని అలవర్చుకుని విజయపథంలో ముందుకు సాగాలన్నారు. సమాజం పట్ల బాధ్యత, మానవీయ సమాజ నిర్మాణ లక్ష్యంగా విద్యార్థులు ముందడుగు వేయాలన్నారు. విద్యార్థులు తమ ఐచ్చిక అంశాలను గుర్తించి వాటిలో నిష్ణాతులుగా తయారైతే విజయం సొంతమవుతుందని తెలిపారు. యూపీఎస్సీ సాధనలో కలెక్టర్ తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సహనం, కరుణ, స్వీయ క్రమశిక్షణ వంటి సుగుణాలను అలవర్చుకుని ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి వర్సిటీ ఎప్పుడు అండగా ఉంటుందని, విద్యార్థులు అధ్యయనంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇండ్రస్టీ కనెక్ట్ డైరెక్టర్ డా.సురేశ్ రెడ్డి, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ సుధారాణి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.