– ఘనంగా నల్లగొండ ఎన్జీ కళాశాల వ్యవస్థాపక దినోత్సవం
– మెరిట్ విద్యార్థులకు బంగారు పతకాల ప్రదానం
రామగిరి, జూలై 22 : డిగ్రీ స్థాయి నుంచే విద్యార్థులు పరిశోధనల్లో రాణించేలా అవగాహన కల్పించి, ప్రోత్సహించాలని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల (ఎన్జీ) వ్యవస్థాపక దినోత్సవం, వివిధ కోర్సుల్లో మెరిట్ సాధించిన విద్యార్థులకు బంగారు పతకాల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కళాశాల 69 సవత్సరాలు పూర్తి చేసుకుని 70వ సంతంలోకి అడుగుపెట్టడం అభినందనీయమన్నారు. స్వయం ప్రతిపత్తి కళాశాలలు పరిశోధనకు పెద్దపీట వేయాలని కోరారు. అధ్యాపకులు పాఠం చెప్పడంతోనే సరిపెట్టుకోకుండా పరిశోధనలో నిమగ్నం కావాలని సూచించారు.
తెలంగాణ కళాశాల విద్యా సంయుక్త సంచాలకుడు డా.డి.ఎస్.ఆర్.రాజేంద్ర సింగ్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ప్రతి ఉద్యోగ ప్రకటనను గమనిస్తూ సిద్ధం కావాలని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ… ఇక నుంచి ప్రతి సంవత్సరం మెరిట్ విద్యార్థులకు బంగారు పతకాలను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ పరీక్షల నియంత్రణాధికారి డా.జి.ఉపేందర్ రెడ్డి, తెలంగాణ కళాశాల విద్య విశ్రాంత సంయుక్త సంచాలకులు డా.జి.యాదగిరి, ప్రభుత్వ ఉమెన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా.శ్రీనివాసరాజు, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు, ఉమెన్స్ కళాశాల గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ పి.రాజారాం, కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డా.కృష్ణప్రసాద్, విశ్రాంత ఆధ్యాపకుడు గుండెబోయిన లింగయ్య, ఎన్జీ కళాశాల పరీక్షల నియంత్రణాధికారి డా. బత్తిని నాగరాజు, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు, ప్రముఖులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.