రామగిరి, నవంబర్ 21 : విద్యా ప్రమాణాలు పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ అచీవ్మెంట్ సర్వే (నాస్) ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఎఫెక్ట్ పడుతున్నది. కుటుంబ సర్వే కోసం ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు విధులు కేటాయించిన విషయం విదితమే. దీని కోసం మధ్యాహ్నం నుంచి పాఠశాలలకు సెలవు ప్రకటించింది. సర్కార్ ఆదేశాలతో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులంతా సర్వేలో నిమగ్నం కావడంతో ఒంటి పూట బడులు ఇవ్వడంతో విద్యార్థులు ఇంటిబాట పడుతున్నారు. ఫలితంగా విద్యార్థుల సామర్థ్యాల పెంపు కోసం మధ్యాహ్నం నుంచి ఉపాధ్యాయులు ఇచ్చే శిక్షణకు పూర్తి ఆటంకం కలుగుతున్నది. ముఖ్యంగా 3వ తరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.
విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేదుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ విద్యా శిక్షణ, రీసెర్చ్ మండలి సంయుక్తంగా నేషనల్ అచీవ్మెంట్ సర్వే (నాస్)ను నిర్వహిస్తున్నది. దీన్ని తొలి పర్యాయం 2021లో నిర్వహించి ఆయా ఫలితాల ఆధారంగా విద్యా విధానంలో తీసుకురావాల్సిన మార్పుల గురించి మండలి, కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కొవిడ్ అనంతరం దేశ వ్యాప్తంగా జరిపే అతిపెద్ద ప్రతిష్టాత్మక విద్యా సర్వే నాస్-2024ను అన్ని యాజమాన్యాల పాఠశాలలోని 3, 6, 9 తరగతుల చదివే విద్యార్థులకు ఈ ఏడాది డిసెంబర్4న నిర్వహిస్తుంది.
విద్యార్థుల్లో భాష, గణితంలో కనీస విద్యా ప్రమాణాలను పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘నాస్’ను అమలు చేస్తుంది. ఈ సర్వేతో వచ్చిన ఫలితాల ఆధారంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. దీని కోసం ఉపాధ్యాయులకు కూడా సర్కార్, విద్యాశాఖ శిక్షణ ఇస్తుంది. ఉపాధ్యాయులు రోజువారీ తరగతులకు ఆటంకం లేకుండా ఉదయం సబ్జెక్టులు బోధించి, మధ్యాహ్నం తర్వాత నాస్ మూల్యాంకనం చేసి వెనుకబడిన విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ టీచర్లు కుటుంబ సర్వేకు వెళ్తుండటంతో నాస్కు తీవ్ర ఆటంకంగా మారిందని పలువురు విద్యా నిపుణులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి కుటుంబ సర్వే కోసం ఎస్జీటీ ఉపాధ్యాయులకు విధులు కేటాయించారు. దీంతో ఆయా పాఠశాలలోని 3వ తరగతి చదివే విద్యార్థులు తీవ్రం గా నష్టపోతున్నారు. 3, 6, 9 తరగతుల విద్యార్థులకు నాస్ ప్రత్యేక శిక్షణ ఉం టుంది. తర్వలో జరిగే నాస్ పరీక్షలో ఆయా పాఠశాలలోని 3, 6 తరగతుల విద్యార్థుల సామర్థ్యాల అచీవ్మెంట్పై సర్వే ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు.
జాతీయ స్థాయిలో డిసెంబర్ 4న నాస్ నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో నాస్ మోడల్ టెస్టులు నిర్వహించి ఫైనల్ నాస్ పరీక్షకు విద్యార్థులను ఉపాధ్యాయులు సిద్ధం చేయాల్సి ఉంది. అయితే నవంబర్లో ఉపాధ్యాయులంతా ఇంటి ంటి సర్వేలోనే ఉంటున్నారు. దీంతో విద్యార్థులకు అందించాల్సిన నాస్ శిక్షణపై తీవ్ర ప్రభావం పడటంతో విద్యా సామర్థ్యాల పెంపు కష్టమేనని తెలుస్తుంది. మరో వైపు ఇప్పటి వరకు ఉపాధ్యాయులు విద్యార్థులకు అందించి శిక్షణను పునఃశ్చరణ చేయడానికి కూడా సమయం లేదు. దీంతో జాతీయ స్థాయి లో మన రాష్ట్రం విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తుండం గమనార్హం. మరో వైపు నాస్ ఆశించిన ఫలితాలు రాకుంటే ఉపాధ్యాయులపై ప్రభావం పడుతుందని ఆందోళనలో ఉన్నారు.
జిల్లా వ్యాప్తంగా నాస్ సర్వే కోసం ఎంపికైన చేసిన పాఠశాలల్లో డిసెంబర్4న నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్ష ఆధ్వర్యంలో సర్వం సద్ధం చేశారు. పరీక్ష నిర్వహణలో ఫీల్డ్ ఇన్వెస్ట్గేటర్స్గా జిల్లాలోని డీఈడీ, బీఈడీ చదివే విద్యార్థులను విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. వీరికి ఈ నెల 28న జిల్లా స్థాయి లో పరీక్ష నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. డీఈఓ బి.భిక్షపతి పర్యవేక్షణలో సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు పరీక్ష నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నారు.