నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్2(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని ఆపాలని, ప్రభుత్వ తీరుపై పోరుబాట పట్టిన విద్యార్థులు, విద్యార్థి సంఘం నేతలపై ప్రభుత్వ నిర్బంధకాండపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా విపక్ష పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు బుధవారం రోడ్లెక్కాయి. యూనివర్సిటీ భూములతో ప్రభుత్వ ఆదాయం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తగదంటూ…. హైదరాబాద్ పర్యావరణానికి పచ్చని వనంగా ఉన్న భూములను కొల్లగొట్టవద్దని ఆగ్రహాం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం మొండివైఖరి వీడి యూనివర్సిటీ భూములను వదిలేయాలని డిమాండ్ చేస్తూ పలు మండలాల్లో బుధవారం కూడా ఆందోళనలు కొనసాగాయి.
గత రెండు రోజులుగా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజా సంఘాలు సైతం మూడో రోజు కూడా అదేబాటులో పయనించారు. ఇప్పటికే దీనిపై బీఆర్ఎస్ యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన గట్టిగా పోరాడుతున్న విషయం తెలిసిందే. దీంతో జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలతోపాటు బీఆర్ఎస్వీ నేతలు సైతం తమ ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. ఎంజీ యూనివర్సిటీతోపాటు పలుచోట్ల బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇక ఏబీవీపీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో తరగతుల బహిష్కరణ చేసి ఆందోళనకు దిగారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చాలాచోట్ల రాస్తారోకోలు, నల్లబ్యాడ్జీలతో రోడ్లపై బైఠాయింపులు జరిగాయి.
నల్లగొండలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ బస్టాండ్ సమీపంలోని సుభాశ్ విగ్రహం వద్ద నల్లజెండాలు, బ్యాడ్జీలు ధరించి రాస్తారోకో చేశారు. భూదాన్ పోచంపల్లిలో సీపీఎం ఆద్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మోతె మండల కేంద్రంలో ఖమ్మం-సూర్యాపేట హైవేపై సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తక్షణమే ప్రభుత్వం భూముల వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మేళ్లచెర్వు, ఆత్మకూర్(ఎస్)లోనూ సీపీఎం శ్రేణులు రాస్తారోకోలు చేపట్టారు. ఇక సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీపీఎం నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హెచ్సీయూ భూముల వేలంపై ఆందోళనకు దిగాయి. ప్రధాన రహదారిపై బైఠాయించి రాకపోకలను అడ్డుకుంటూ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. కోదాడ పట్టణంలోనూ సీపీఎం శ్రేణులు రాస్తారోకో చేపట్టి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. భువనగిరిలో హెచ్సీయూ భూముల పట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.