నీలగిరి, జూన్ 10 : అన్ని రంగాల్లో నల్లగొండ జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, ధాన్యం సేకరణ తదితర అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాగునీరు అందించి జిల్లాను సస్యశ్యామలం చేయడమే ధ్యేయమని, అందుకే ఏఎమ్మార్పీ కాల్వల లైనింగ్, బ్రాహ్మణ వెల్లెంల, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను చేపట్టినట్లు తెలిపారు. నార్కట్‌పల్లి మండలం కొండపాకోనిగూడెంలో ఓ రైతుకు సంబంధించిన పొలంలో 40 మీటర్ల మేర కాల్వ పనులు ఆగిపోయిన విషయం అధికారులు మంత్రి దృష్టికి తేగా కలెక్టర్ నిధుల నుంచి రైతుకు నష్టపరిహారం మంజూరు చేసి వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ధాన్యం సేకరణలో జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపినందుకు ఆయన కలెక్టర్‌ను అభినందించారు. సమావేశంలో కలెక్టర్ చంద్రశేఖర్, నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్‌రెడ్డి, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పిచ్చయ్య, పౌర సరఫరాల డీఎం రాంపతి నాయక్ ఉన్నారు.
మాన్యంచెలలో రూ.44 లక్షలతో నిర్మించనున్న ఉర్దూ మీడియం ప్రైమరీ సూల్ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. వెం టనే పనులు ప్రారంభించాలని అవసరమైతే మరో రూ.కోటి ఖర్చు చేసి మంచి భవనం నిర్మించాలన్నారు. అనంతరం మంత్రి కలెక్టరేట్ సమీపంలోని డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు హఫీజ్ ఖాన్, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు, మౌలానా సిద్ధికి, బషీర్, అక్బర్ ఖాన్ ఉన్నారు.
మాడ్గులపల్లి, జూన్ 10: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం మాడ్గులపల్లిలో నిర్మాణంలో ఉన్న కాంప్లెక్స్ భవనాల పనులను పరిశీలించిన అనంతరం చెరువుపల్లిలో గ్రామ పంచాయతీ భవనం, గ్రామ సమాఖ్య భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మా డ్గులపల్లి నుంచి మర్రిగూడ వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టామని, కోనేటిపురం వరకు రూ.60 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణం కొనసాగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.20 వేల కోట్లతో హ్యామ్ రోడ్లు, మరో రూ.7 వేల కోట్లతో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా గ్రామీణ రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో రమణారెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సైదులు, తహసీల్దార్ సరోజపావని, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.