– ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్
– నిర్మల్ ఎస్వీఆర్ ఆస్పత్రి వైద్య సిబ్బందిపై దాడికి ఖండన
నీలగిరి, మార్చి 28 : వైద్యులపై దాడులు జరగకుండా ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకువచ్చి ఖచ్చితంగా అమలు చేయాలని ఐఎంఏ రాష్ట్ర మాజీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పుల్లారావు, నీలగిరి బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ రమేశ్, సెక్రటరీ డాక్టర్ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం నిర్మల్ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో గల ఎస్వీఆర్ హాస్పిటల్ లోని సిబ్బంది, డాక్టర్ పై దుండగులు చేసిన దాడిని వారు తీవ్రంగా ఖండించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ డాక్టర్ కిషన్, సెక్రటరీ డాక్టర్ అశోక్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం నీలగిరి బ్రాంచ్ తరపున డాక్టర్లందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిర్మల్ లోని ఎస్వీఆర్ చిన్నపిల్లల హాస్పిటల్ లో డాక్టర్ సంతోష్ రాజ్ సీనియర్ పిల్లల వైద్య నిపుణుడు పేషెంట్ కు ఉన్న జబ్బును నయం చేసి డిశ్చార్జ్ చేసే సమయంలో బిల్లు చెల్లించకుండా డాక్టర్ విధులు నిర్వహిస్తున్న సమయంలో అతడిపై చేయి చేసుకుని దురుసుగా ప్రవర్తించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వైద్యులు జార్జి ప్రవీణ్, అనిత, రాణి, విశ్వ జ్యోతి, రామచంద్ర, దేవాదినం, రాజిరెడ్డి, శ్రీనివాస్ రావు, అరుంధతి, పద్మ, రాజేశ్వరి పాల్గొన్నారు.