నల్లగొండ, అక్టోబర్ 27 : ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. సోమవారం కనగల్ మండలం పగిడిమర్రిలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఇటీవల కురిసిన వర్షానికి ధాన్యం తడవడం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏపీఎం, సెంటర్ ఇన్చార్జిలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ధాన్యం సేకరణలో ఎవరు నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని హెచ్చరించారు. పగిడిమర్రిలో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం సరైన స్థలంలో లేనందున తక్షణమే ఇతర ప్రదేశానికి మార్చాలని, ఇందుకుగాను అనువైన ప్రభుత్వ స్థలాన్ని చూడాలని తాసీల్దార్ పద్మను ఆదేశించారు.
కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ప్రతిరోజు ధాన్యం తేమ శాతాన్ని పరీక్షించాలన్నారు. ధాన్యాన్ని కొని తూకం వేసిన తర్వాత జాప్యం చేయకుండా వెంటనే లారీలలో లోడ్ చేసి మిల్లులకు పంపించాలన్నారు. జాప్యం చేస్తే అటు రైతుకు, ఇటు మిల్లర్లకు ఇబ్బంది కలుగుతుందన్నారు. మిల్లర్లు కూడా మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. రైతులు తాలు, తరుగు లేకుండా సరైన తేమ శాతంతో పూర్తి నాణ్యత ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
తుఫాన్ కారణంగా రానున్న రెండు, మూడు రోజులు వర్షాలు వచ్చే సూచన ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలని, ఎండ వచ్చినప్పుడు మాత్రమే ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని, సరైన తేమ, నాణ్యత ప్రమాణాలతో ఉంటే వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి, డీఎస్ఓ వెంకటేశం, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ, తాసీల్దార్ పద్మ, ఎంపీడీఓ, ఏపీఎం ఉన్నారు.

Nalgonda : ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి