నీలగిరి, నవంబర్ 10: ర్యాగింగ్ చట్ట వ్యతిరేకమని, అలాంటి విష సంస్కృతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. సోమవా రం నల్లగొండ మెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని, తోటి విద్యార్థులతో సోదరభావంతో మెలగాలని, సీనియర్లు, జూనియర్లు అనే బేధం లేకుండా కలిసిమెలిసి ఉండాలన్నారు. సీనియర్లు కూడా ఒకప్పుడు జూనియర్లమనే విషయం మరచిపోవద్దన్నారు. తోటి విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడి, తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.
చట్ట ప్రకారం ర్యాగింగ్‌కు పాల్పడి కేసు నమోదైతే, 6 నెలల నుంచి 3 ఏండ్ల జైలు శిక్ష ఉంటుందన్నారు. ఎంతో కష్టపడి చదివి, మెడికల్ కళాశాలలో సీటు సంపాదించి కేసులు నమోదై, జైలుకు వెళ్తే తల్లిదండ్రులు ఎంత బాధపడతారో గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తూ ర్యాగింగ్ భూతాన్ని కళాశాల నుంచి తరిమేయాలని సూచించారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా, డయల్ 100 ద్వారా సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శివరాం రెడ్డి, ఎస్బీ సీఐ రాము, వన్‌టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ సైదాబాబు, సైదులు కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ రాధాకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.