తుంగతుర్తి, మే 19 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు బస్తాల్లో కాంటా వేసి, ఆ ధాన్యాన్ని మిల్లులకు పంపిణీ చేయాలని, నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ హెచ్చరించారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో పాటు, పలు ఐకెపి ధాన్యం కేంద్రాలను ఆయన పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. రైతులు పంపిన ధాన్యాన్ని మిల్లర్ల యాజమాన్యం ఇష్టారాజ్యంగా కటింగ్ చేస్తే చర్యలు తప్పవన్నారు. స్టేడియంలో నిల్వ ఉన్న ధాన్యపు బస్తాలను లారీ పిలిపించి తక్షణమే ఎగుమతి చేయించారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
వేసవి తాపంతో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు లారీలు తెప్పించి ఎగుమతి చేయాలన్నారు. సూర్యతండా మాజీ సర్పంచ్ నాకావత్ యాకూ నాయక్ తమ గ్రామంలో ధాన్యం బస్తాల్లో నింపి కాంటా పెట్టి లారీ లేక ధాన్యం నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ తక్షణమే సంబంధింత అధికారులతో మాట్లాడి లారీలు వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట జిల్లా ఉన్నతాధికారులు, మండల అధికారులు, తాసీల్దార్ దయానందం, ఏడీఏ రమేష్ బాబు, ఎంపీడీఓ శేష్ కుమార్ ఉన్నారు.

రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్