సూర్యాపేట, మే 30 : నకిలీ విత్తనాలు అమ్మినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాల్లో గురువారం సాయత్రం ఆకస్మిక తనిఖీలు చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు సరిపోయే విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. నాణ్యమైన విత్తనాలు మాత్రమే అమ్మాలని, విక్రయించేటప్పుడు రైతులకు విధిగా బిల్లులు ఇవ్వాలని డీలర్లకు సూచించారు. విత్తనాల అమ్మకాల సమయంలో రికార్డులు రాయాలని, ప్రత్యేక రిజిస్టర్లో రైతులకు అమ్మిన సరుకుల వివరాలు పొందుపర్చాలని అన్నారు.
జిల్లాలోని 23 మండలాల్లో క్రమశిక్షణ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మూడు టాస్క్‌ఫోర్స్ టీములను ఏర్పాటు చేస్తామని, అందులో ఆర్డీఓ, డీఎస్పీ, అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారులు ఉంటారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 26 బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తాయని, మండల ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో మండల టీమ్‌లు పనిచేస్తాయని చెప్పారు. కల్తీ విత్తనాలు సరఫరా కాకుండా ప్రత్యేక నిఘా పెట్టామని, రైతులు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసేలా వారికి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. డీలర్లు నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి, ఎస్ఐ లోకేశ్, వ్యవసాయ అధికారులు రాజగోపాల్, దినకర్ పాల్గొన్నారు.