అర్వపల్లి, జూలై 01 : విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయా విభాగాల సిబ్బందిని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ హెచ్చరించారు. మంగళవారం జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, తాసీల్దార్ కార్యాలయాలను ఆయన పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసి ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణీలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సహజ కాన్పులు అయ్యే విధంగా వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు గర్భిణులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్రామంలో ఆరోగ్య సిబ్బంది అప్రమత్తగా ఉండాలని, జ్వర బాధితులను గుర్తించి ఆరోగ్య కేంద్రానికి పంపాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆశ డే కార్యక్రమం గురించి అరా తీశారు.
విద్యార్థులు తెలుగు, ఆంగ్లంలో పట్టు సాధించాలని కలెక్టర్ అన్నారు. జడ్పీహెచ్ఎస్లో సిబ్బంది హాజరు, వివరాలు పరిశీలించిన ఆయన 10వ తరగతి విద్యార్థులను ఇంగ్లీష్ సబ్జెక్టుపై పలు ప్రశ్నలు అడిగారు. సందేహాలు ఉంటే వెంటనే ఉపాధ్యాయులని అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. ఇంగ్లీష్ లో వెనకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి నందు ఇంగ్లీష్ సబ్జెక్టు ని విద్యార్థులచే చదివించారు. బోర్డుపై ఉన్న పదాలను విద్యార్థులు మంచిగా చదవడంతో కలెక్టర్ మెచ్చుకున్నారు. అంగన్వాడీ కేంద్రం పరిశీలించి మెనూ ప్రకారం పిల్లలకి భోజనం అందించాలని సూచించారు.
తాసీల్దార్ కార్యాలయంలో భూ భారతి సదస్సుల ద్వారా ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని తెలిపారు. క్షేత్ర స్థాయి పరిశీలనకి నోటీసులు జారీ చేసిన కుంచుమర్తి, బొల్లంపల్లి గ్రామాలకు చెందిన అర్జీలను పరిశీలించారు. త్వరగా క్షేత్ర స్థాయి పరిశీలన చేసి భూ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవరావు, తాసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ గోపి, మండల మెడికల్ అధికారి నగేశ్ నాయక్, జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం బాలు నాయక్, ఎంపీపీఎస్ హెచ్ఎం ఇందిరా, ఉపాధ్యాయులు మంజుల, నాగరాజు, హెల్త్ సూపర్ వైజర్ లలిత, ఆర్ఐలు జలందర్, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.