‘ఇంకా ఎన్ని సంఘటనలు జరిగితే.. ఎంత మంది పిల్లలను కరిస్తే.. ఎందరి కండ్లు ఊడిపడితే.. ఈ చేతగాని ప్రభుత్వం మేల్కొంటుంది. ఇది ఒక్క ఏరియానో ఎదుర్కొంటున్న సమస్య కాదు. ప్రతి గల్లీ, ప్రతి ఊరులో ఉన్న సమస్య. ఇది ఎండాకాలం ఇంకా కుక్కల దాడులు ఎక్కువయ్యే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిన చర్యలు తీసుకోవాలి. ప్రజల మధ్య కుక్కలు తిరగకుండా నివారణ చర్యలు కోసం అడుగులు వేయాలి’ ఇది భువనగిరిలో చిన్నారులపై కుక్కల దాడి నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరలవుతున్న పోస్టు.
యాదాద్రి భువనగిరి, మార్చి 27 (నమస్తే తెలంగాణ): గ్రామసింహాలు యథేచ్ఛగా స్వైరవిహారం చేస్తున్నాయి. గ్రామం, పట్టణం అనే తేడా లేకుండా గుంపులుగా సంచరిస్తూ వీరంగం సృష్టిస్తున్నాయి. తెగబడుతూ కరుస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయి. శునకాలు కనిపిస్తే చాలు స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. భువనగిరిలో చిన్నారులపై దాడుల నేపథ్యంలో జనం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రభుత్వ యం త్రాంగం మాత్రం ఎలాంటి నివారణ చర్యలు చేపట్టకుండా మొద్దు నిద్రలో జోగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలో కుక్కల కష్టాలు తప్ప డం లేదు. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న వాటి సంతతిని చూసి జనాలు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో మహిళలు, పిల్లలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. సాధారణంగా మనుషులను చూసి పారిపోయే పరిస్థితి పోయి.. జనంపైకి, వాహనాలపైకి ఎగబడుతున్నాయి. దీంతో అటు పాదచారులు, ఇటు ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పిల్లలను ఒంటిరిగా బయటకు పంపాలంటే భయంగా ఉందని ఆందోళన చెందుతున్నారు.
గురువారం భువనగిరిలో ఓ చిన్నారిపై కుక్కలు దాడి చేసి, కన్నుగుడ్డు పీకిన విషయం తెలిసిందే. వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం గతంతో పోలిస్తే 2025 లో కేసులు డబుల్ అయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2025లో ఏకంగా 8,727 కుక్క కాటు కేసులు ఆస్పత్రికి వచ్చాయి. ఈ లెక్కన రోజు కు 24 మంది కుక్కకాటుకు గురయ్యారు. 2024లో 4,756 కేసులు, 2023లో 4,287 కేసులు, 2022లో 4,183 కేసులు రికార్డయ్యాయి. కుక్క పిక్క పీకితే లబోదిబోమంటూ నిత్యం పదుల సంఖ్యలో కుక్క కాటు బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.
కుక్కల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో వాటి సంతతి విపరీతంగా పెరిగిపోతోంది. కుక్కలకు కుటుంబ నియంత్రణ కార్యక్ర మం తూతూమంత్రంగా కొనసాగుతున్నది. ఇందుకోసం నిధులు కేటాయిస్తున్నా కాగితాలపైనే లెక్క లు చూపుతూ.. నిధుల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. యాదాద్రి జిల్లాలో 30 వేలకుపైగా కుక్కలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
ఇటీవల అధికారులు కేవలం ఆరు మున్సిపాలిటీల్లో యానిమల్ బర్త్ కంట్రోల్(ఏబీసీ) కార్యక్రమంలో 2,661 కుక్కలు మాత్రమే స్టెరిలైజేషన్ చేపట్టారు. ఆలేరులో కేవలం 26 శునకాలకు మాత్రమే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేశారు. స్టెరిలైజేషన్ కోసం ఎక్కడి నుంచైతే తీసుకెళ్తున్నారో మళ్లీ అక్కడే వదిలేసి పోతున్నారు. గతంలో ప్రభుత్వ కార్యాలయా లు, పాఠశాలలు, గ్రామ పంచాయతీ తదితర చోట్ల కుక్క కాటుకు గురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించేలా సూచనలు ఉండేవి. ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ప్రచారలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. కుక్క ల బెడద నుంచి కాపాడి, తగిన చర్యలు తీసుకోవాని జనం డిమాండ్ చేస్తున్నారు.
సూర్యాపేటటౌన్, మార్చి 27: వీధి కుక్క దాడిలో మహిళకు తీవ్ర గాయాలైన ఘటన పట్టణంలోని సుందరయ్యనగర్లో జరిగింది. సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన జాల లక్ష్మమ్మ లాక్డౌన్ సమయంలో కుటుంబంతో వచ్చి సూర్యాపేటలోని సుందరయ్యనగర్లో నివాసం ఉంటున్నారు. కొడుకు వ్యవసాయ మార్కెట్ హమాలీగా, బాధితురాలు గేదెలు కొనుగోలు చేసి పాలు అమ్ముకొని జీవిస్తున్నారు. గేదెలను వ్యవసాయ మార్కెట్ సమీపంలో మేపుకొని ఇంటికి వెళ్తుండగా ఆమెపై కుక్క దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ దవాఖానకు తరలించారు. బాధితురాలిని 18వ వార్టు కౌన్సిలర్ డాక్టర్ ఊర రామ్మూర్తియాదవ్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.