నూతనకల్, మే 22: మండలంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఒక్కో గ్రామంలో వందల సంఖ్యలో కుక్కలు ఉన్నాయి. చాలా గ్రామాల్లో గొర్రెలు, మేకలు, కోళ్లను చంపి తింటున్నాయి. అంతేకాకుండా చాలామంది కుక్కకాటుకు గురవుతున్నారు. రాత్రివేళల్లో వీధుల్లో తిరుగుతూ అరుస్తుండడంతో నిద్రపట్టని పరిస్థితులు నెలకొంటున్నాయని ప్రజలు వాపోతున్నారు. చిన్నారులను ఆడుకునేందుకు బయటకు పంపిద్దామంటేనే భయపడే పరిస్థితి ఉందని పలువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రోడ్లపై వెళ్తున్న వారిని వెంబడిస్తూ భ్రయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
గత రెండు నెలల్లో మండలంలో సుమారు 35 మందికి పైగా కుక్క కాటుకు గురైనట్లు నూతనకల్ దవాఖానలోని రికార్డులు చెబుతున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో వృద్ధులు ఎక్కువగా బాధితులుగా ఉంటున్నారు. మండల కేంద్రం నూతనకల్లోని సూర్యాపేట-దంతాలపల్లి ప్రధాన రహదారిపై నిత్యం వందల సంఖ్యలో భారీ, ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రహదారిపై కుక్కలు అడ్డు రావడం వల్ల వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుక్కలు వెంబడించడంతో కొన్ని సందర్భాల్లో వాహనాదారులు కిందపడి గాయాలపాలైన సంఘటనలు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా మండలంలోని మాచనపల్లి, లింగంపల్లి, చిల్పకుంట్ల, దిర్శనపల్లి, బిక్కుమళ్ల, మిర్యాల, చిననెమిల, తాళ్లసింగారం తదితర గ్రామాల్లో కుక్కల బెడద అధికమైందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతనకల్, తాళ్లసింగారం గ్రామాల్లో గత సంవత్సరం కుక్కల గుంపులు గొర్రెల మందలపై దాడి చేసి 50 గొర్రెలను చంపివేశాయి. పలుమార్లు పంచాయతీ పాలకులకు విన్నవించినా కుక్కల బెడద నివారించలేకపోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి కుక్కల బెడదను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
గ్రామాల్లో వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ మనుషులు, పశువులుపై దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి.ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని తిరగాల్సి వస్తుంది. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. అధికారులు స్పందించి కుక్కల బారి నుంచి కాపాడాలి.