యాదాద్రి భువనగిరి, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో 25 సింగిల్ టీచర్ స్కూళ్లు ఉన్నాయి. అనేక పాఠశాల్లో పిల్లలున్న దగ్గర ఉపాధ్యాయుల్లేరు. ఉపాధ్యాయులున్న చోట విద్యార్థుల్లేరు. దీంతో అనేక పాఠశాలలు మూతబడిపోతున్నాయి. అత్యధికంగా గిరిజన ప్రాంతాల్లోనే జీరో ఎన్రోల్మెంట్ నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో పేదలకు విద్య అందని ద్రాక్షగానే మారుతున్నది.
68 బడుల్లో జీరో ఎన్రోల్మెంట్..
జిల్లాలో మొత్తం 672 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 630 స్థానిక సంస్థల పాఠశాలలు, 20 ప్రభుత్వ బడులు, 11 కేజీబీవీలు, 7 ఆదర్శ పాఠశాలలు, 3 తెలంగాణ సాధారణ గురుకులాలు, ఒక అర్బన్ గురుకుల పాఠశాల ఉన్నది. వీటిల్లో 45,296 మంది విద్యార్థులు చదువుతున్నారు. అత్యధికంగా 24,169 మంది బాలికలు ఉన్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. 68 బడుల్లో జీరో ఎన్రోల్మెంట్ నమోదైంది. అంటే సుమారు 10 శాతానికి పైగా బడుల్లో విద్యార్థులే లేరు. దీంతో చేసేదేం లేక కొన్ని చోట్ల పాఠశాలలు మూసేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు పెరిగిపోవడం, వేరే గ్రామాలకు వెళ్లి చదువుకోవడానికి తగిన సదుపాయాలు లేకపోవడం, గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు పెరగడం, ప్రభుత్వ పాఠశాల్లో విద్యాప్రమాణాలు లోపించడమే జీరో ఎన్రోల్మెంట్కు ప్రధాన కారణాలు. ఇక జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులను అవసరం ఉన్న చోటకు బదిలీ చేస్తున్నారు.
గిరిజన తండాల్లోనే జీరో..
జిల్లాలో అత్యధికంగా జీరో ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలలు గిరిజన తండాల్లోనే ఉండటం గమనార్హం. జిల్లాలోని నారాయణపురం, తుర్కపల్లి మండలాల్లో గిరిజనులు అధికంగా ఉన్నారు. ముఖ్యంగా తుర్కపల్లి మండలంలోని గుగులోత్ తండా, దయ్యంబావి తండా, మామిడికుంట తండా, పెద్దతండా, పీర్యా తండా, నారాయణపురం మండలంలోని బోటిమీది తండా, గాంధీనగర్ తండా, గంగాముల తండా, కడపగండి తండా, సపావట్ తండా, వాచ్యా తండాల్లో సున్నా ఎన్రోల్మెంట్ ఉంది. ఇవే కాకుండా బీబీనగర్ మండలంలోని కొత్త తండా, బొడక తండా, మోత్కూరు మండలంలోని పనకబండ, బొమ్మలరామారం మండలంలోని మొండికుంట తండాల్లోని బడుల్లో జీరో ఎన్రోల్మెంట్ నమోదైంది.
బడిబాట ఉత్తదేనా..?
ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని తీసుకొచ్చినా ఫలితం లేకుండాపోతున్నది. కొన్ని పాఠశాలల్లో ఒక్క విద్యార్థిని కూడా చేర్పించలేదంటే బడిబాట విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. ఏటా విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే ముందు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా బడి ఈడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పిస్తారు. సర్కారు పాఠశాల్లోల మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్ తరగతులు, తదితర కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తారు. ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి చేస్తారు. అంతేకాకుండా గతేడాదితో పోలిస్తే 10 శాతం పెంపొందించే బాధ్యత ఉపాధ్యాయులకు నిర్దేశిస్తారు. ఇన్ని చేసినా జిల్లాలో అనేక చోట్ల జీరో ఎన్రోల్మెంట్తోపాటు 10మంది లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు భారీగా నమోదు కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
25 సింగిల్ టీచర్ బడులు..
ఇక జిల్లాలోని పలు పాఠశాలల్లో ఒక్కరే టీచర్ బోధిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. జిల్లాలోని 25 పాఠశాలల్లో ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారు. ఇవి కూడా గిరిజన ప్రాంతాల్లోనే ఉండటం గమనార్హం. ఆలేరు మండలంలోని కందిగడ్డ తండా, భువనగిరి మండలంలోని రెడ్డినాయక్ తండా, బీబీనగర్ మండలంలోని నెమురగోముల తండా, తుర్కపల్లి మండలంలోని గుజ్జవానికుంట, జంగారెడ్డి కుంట తండా, రామోజీ నాయక్ తండా తదితర గ్రామాల్లోని పాఠశాలల్లో ఒక్కరే టీచర్ ఉన్నారు. దీంతో విద్యార్థులకు అన్ని సబ్జెక్టులను ఒక్కరే బోధిస్తున్నారు. ఫలితంగా సరైన విద్య అందని దుస్థితి నెలకొంది. ఏదైనా అవసరం పడి.. సదరు ఉపాధ్యాయులు సెలవు పెడితే.. ఆ రోజు బడి బంద్ చేయాల్సిన పరిస్థితి. ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించడంలో విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.