ఈ భూమి మాదేనని
ప్రపంచమంతా వినిపించి.. కనిపించేలా
పిడికిళ్లెత్తి సమాధానమిచ్చినం కదా
కొత్తగా మళ్లా ఈ రోతరాగమేంది
మూడు లింగాల నడుమ వెలసిన విరిసిన
ముచ్చటైన పలుకు మాదని మేమంటే
తెలుగు భాషకు పుట్టినిల్లయి వెలిగిన మాకే
మాట తీరు లేదని మీరు ఎగతాళి చేస్తిరి
బూటకపు పొత్తుతో చీకటి చేయి కలిపి
వెకిలి నాటకలాడి మా నోట మట్టి కొడ్తిరి
ఒక్కటైనమని తోడబుట్టిన ప్రేమ జూపిస్తే
వెటకారపు వేషాలతో విలువ కోల్పోతిరి
నీ ముత్తాతకు ముత్తాత పుట్టకముందే
ముత్యాలు కుప్పలు అమ్మిన నేల మాది
బండరాళ్ల పట్నాన్ని ఉద్ధరిచ్చినమని పేకి
చెరువు కాలువలన్నీ చెరబడితిరి
సదురుకొని బతుకుమని నీది నీకు జూపిస్తే
శాతగాని చేతలతోని మమ్ముల కరుసుడేంది
సూసుకుంట నువ్వు గాన్నే ఉండిపోతవ్
లోకమంతా జూసేటట్టు మేం వెలిగిపోతం
ఆస్తిపాస్తుల ధనదాహ పైత్యంతో
అస్తిత్వాల మధ్య అగాథం పెంచితిరి
వ్యాపార గర్వపు తలతిమ్మిరి జూపించి
ఆత్మగల్ల మనుషుల నడుమ గోడకడ్తిరి
వేరుపడ్డా తీరు మారని రేవు మీది
వీరచరిత గలిగిన
పదేండ్ల పురోగతి పరుగు మాది
-కొత్త అనిల్‌కుమార్ ,9395553393