కట్టంగూర్, జూన్ 17 : నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్- విజయవాడ 65వ జాతీయ రహదారి వెంబడి వాహనాలు ఎక్కడపడితే అక్కడ ఆపుతుండడంతో ప్రమాదాలకు దారితీస్తున్నాయి. భారీ వాహనాలను రహదాలపై నిలిపివేయడంతో రాకపోకలకు ఇబ్బందులు కలిగి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కట్టంగూర్ మండల పరిధిలో అయిటిపాముల నుండి పామనుగుండ్ల వరకు దాబాలు, చిన్నపాటి హోటళ్లతో పాటు కల్లు మండువలు ఉండడంతో వాహనదారులు రహదారిపై గంటల తరబడి వాహనాలను ఆపుతున్నారు.
దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. రహదారి పక్కన వాహనాలు ఆపడంతో గతంలో ప్రమాదాలు జరిగి ఎంతో మంది మృత్యువాత పడగా, మరికొందరికి గాయాలయ్యాయి. ప్రమాదాలు జరుగుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికైనా ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.