కట్టంగూర్, మే 15 : నర్సరీలో పెంచే ప్రతి మొక్క బతికేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని కురుమర్తి గ్రామ నర్సరీని పరిశీలించి మొక్కల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్బరీల్లోని మొక్కలను ఏడు భాగాలుగా విభజించి బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. జూన్ చివరి వారంలోగా మొక్కలు రెండున్నర నుంచి మూడు ఫీట్ల వరకు ఎదుగుదల ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నర్సరీలో మొక్కల పెంపకాన్ని వేగవంతం చేయడంతో పాటు చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటాలన్నారు.
జూన్‌లో వర్షాలు పడగానే మొక్కలన్నీ నాటడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఎరసానిగూడెం, నారెగూడెం గ్రామాల నర్సరీలను పూర్తిస్థాయిలో పరిశీలించి నివేదికను సమర్పించాలని ఎంపీఓను, ఉపాధి కూలీలకు కనీస వేతనం రూ.307 తగ్గకుండా చర్యలు చేపట్టాలని ఏపీఓ, ఈజీఎస్ సిబ్బందిని ఆదేశించారు. మొక్కల పెంపకంలో నిరక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట క్లస్టర్ పీడీ నర్సింహ్మరావు, ఎంపీఓ చింతమల్ల చలపతి, ఏపీఓ కడెం రాంమోహన్, ఏపీఎం సైదులు, కార్యదర్శులు జయసుధ, పెద్దయ్య, శేఖర్, ఈసీ శ్రీధర్, నర్సరీ నిర్వహకులు పాల్గొన్నారు.