— సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున
నల్లగొండ రూరల్, అక్టోబర్ 22 : నల్లగొండ మండలం ముశంపల్లి గ్రామ రైతుల ధాన్యాన్ని నల్లగొండ పరిధిలోని రైస్ మిల్లర్లకు తరలించకుండా చిట్యాలకు తరలించడంలో అంతర్యం ఏమిటని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున అధికారులను ప్రశ్నించారు. బుధవారం నల్లగొండ మండలం ముశంపల్లి గ్రామంలో ఐకెపి కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. ధాన్యాన్ని స్థానిక మిల్లులకు తరలించకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తే దోపిడీ చేయడానికి మిల్లర్స్ కు అవకాశం కల్పించినట్లే అవుతుందన్నారు. ఆ రైస్ మిల్లర్లు కొనుగోళ్లకు వివిధ కొర్రీలు పెడుతూ లారీ లోడు ధాన్యానికి క్వింటాళ్లలో కోత కోస్తున్నట్లు తెలిపారు.
రైతులు తమ రక్తం, చెమటతో పండించిన వరి పంటను ఐకెపి కేంద్రాలకు తరలించి రాసులుగా పోశారని, పట్టాలు కప్పినప్పటికీ భారీ వర్షాలతో గాలులు వీచి పట్టాలు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసి ముద్దయిందన్నారు. ఐకెపి కేంద్రాల్లో సరైన వసతులు, భూమి సదుపాయాలు లేక రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తిరస్కరించడం అన్యాయం అన్నారు. రైతుల పక్షాన ప్రభుత్వం నిలబడి వెంటనే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు.
మాయిశ్చర్ పేరుతో వారాల తరబడి రైతులను కేంద్రాల్లో వేధించడం సరికాదన్నారు. తేమ శాతాన్ని20 వరకు పెంచి తడిసిన ధాన్యాన్ని సడలింపుతో కొనుగోలు చేయాలని, రైతులకు కనీసం పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులు నిరసనలకు దిగే పరిస్థితి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, మండల కార్యదర్శి నలపరాజు సైదులు, సభ్యులు జిల్లా అంజయ్య, పోలే సత్యనారాయణ, బొల్లు రవీంద్ర కుమార్, కొండ వెంకన్న, రైతులు ఎర్ర మాదా బాబురెడ్డి, కండె యాదగిరి, శివ పాల్గొన్నారు.