రామగిరి, జూలై 10 : రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖల్లో ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తుండగా దేవాదాయ ధర్మాదాయ శాఖలోనూ ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ శాఖలోని ఈఓ, కార్యాలయ సిబ్బందికి స్థాన చలనం కల్పించేలా ప్రణాళికలు జరుగుతున్నాయి. అదే మాదిరిగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, అర్చకులకు వర్తింపజేయనున్నారు. బదిలీలకు సంబంధించి రాష్ట్ర శాఖ నుంచి ఉత్తర్వులు అందలేదని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.మహేందర్‌కుమార్ తెలిపారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ పరిధిలోని దేవాలయాల్లో సిబ్బంది, అర్చకులు కొందరు నియామకం జరిగినప్పటి నుంచి ఒకేచోట పనిచేస్తుండగా, మరికొందరు 15 నుంచి 20 ఏండ్లు నుంచి స్థానచలనం లేకుండా కొనసాగతున్నారనేది వాస్తవం. దాంతో రాష్ట్ర దేవాదాయ శాఖ అర్చకులు, ఆలయ ఉద్యోగులను బదిలీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది.
ఉమ్మడి నల్లగొండతోపాటు జనగామ జిల్లాలోని కొంత ప్రాంతంలో కలిపి ఉమ్మడి జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో 65 గ్రాంట్ ఇన్ ఎయిడ్ దేవాలయాలు ఉండగా 279 మంది ఉద్యోగులు, అర్చకులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఏండ్ల తరబడి ఒకే చోట పనిచేస్తుండటంతో ఆలయాల నిర్వహణ సక్రమంగా సాగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బదిలీలు జరిగితే అంతా సవ్యంగా నడిచే అవకాశాలు ఉండనున్నట్లు తెలుస్తుంది. మరో వైపు గతంలో ఏమైనా అక్రమాలు జరిగితే అవి బయటకు వస్తాయని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు వెల్లడిస్తుండటం గమనార్హం.
4