చౌటుప్పల్, ఫిబ్రవరి 21 : గొర్రెల పంపిణీ పథకానికి సీఎం కేసీఆర్ రూ.12వేల కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్ర షీప్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు. చౌటుప్పల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల రెండో విడుత గొర్రెల పంపిణీ లబ్ధిదారులకు మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ పథకం ద్వారా 7లక్షలకు పైగా గొల్లకురుమల కుటుంబాలకు లబ్ధి చేకూరుతున్నదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.50కోట్ల గొర్రెలు, మేకలు ఉన్నాయని చెప్పారు. పశువులకు బాగాలేకపోతే 1962 అంబులెన్స్ కూడా ప్రభుత్వం సమాకూర్చిందన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకాలు లేవన్నారు. ప్రసుత్తం రోడ్ల మీద నడుస్తున్నవి గొర్రెలు కావు.. గొల్లకురుమల డాలర్లని ఆయన పేర్కొన్నారు. 50 సంవత్సరాలు నిండిన గొర్రెల కాపరులకు పింఛన్లు, ప్రమాదానికి గురైన వారికి ఎక్స్‌గ్రేషియా అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని చెప్పారు. వాటి కోసం మరో రూ.2వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన్నట్లు తెలిపారు. రెండో విడుతలో నగదు బ్యాంకుల్లో జమకాని కొంతమంది లబ్ధిదారులు అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇటీవల బ్యాంకులు విలీనం కావడంతో ఐఎఫ్ఎస్సీ కోడ్ మూలంగా జమ కాలేదని తెలిపారు.
– ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
గొల్లకురుమల ఆర్థికాభివృద్ధికే సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకం ప్రవేశపెట్టారని, దేశంలో ఎక్కడా ఈ పథకం లేదని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మునుగోడు నియోజకవర్గంలో రూ.93 కోట్లను లబ్ధిదారులకు ప్రభుత్వం ఎన్నికల ముందే అకౌంట్లలో వేసిందన్నారు. మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, సంస్థాన్‌నారాయణపురం ఎంపీపీ ఉమాదేవి, జడ్పీటీసీ భానుమతి, జేడీఏ కృష్ణ, ఏడీ అయిలయ్య, పీఏసీఎస్ చైర్మన్లు దామోదర్‌రెడ్డి, జంగారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీశైలం, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆయోధ్యయాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నిరంజన్‌గౌడ్, పట్టణాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశం, పర్వతాలు, బాలరాజు పాల్గొన్నారు.