హాలియా/త్రిపురారం, మార్చి 24 : ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి కోరారు. త్రిపురారం మండల కేంద్రంలోని సుశీల ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ త్రిపురారం మండలం ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే నోముల భగత్మకుమార్, జిల్లా గ్రంథాలయ అభివృద్ధి సంస్థ చైర్మన్ రెగట్టె మల్లికార్జున్‌రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ సకల జనుల సమ్మె, యువకుల ఆత్మ బలిదానాల సాక్షిగా తెలంగాణ రాష్టాన్ని సాధించామన్నారు. సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించడంతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ఇవ్వాల్సిన డబ్బులు సకాలంలో ఇవ్వకుండా రాష్ర్టాభివృద్ధిని అడ్డుకుంటున్నదని విమర్శించారు. గ్రామీణాభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 20అవార్డుల్లో 19 మన రాష్ర్టానికే వచ్చాయన్నారు. రాష్ట్రంలో నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఇక్కడి నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా, 18ఏండ్లు మంత్రిగా పనిచేసిన జానారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. ఇప్పటికే తండ్రీకొడుకు చేతిలో ఓడిపోయిన జానారెడ్డి మూడోసారి ఓడిపోవడం కన్నా పోటీ చేయకపోవడమే మేలని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు నరేందర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవల్లి విజయేందర్‌రెడ్డి, హాలియా, నిడమనూరు వ్యసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు జవ్వాజి వెంకటేశం, మర్ల చంద్రారెడ్డి, పెద్దవూర జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామర్లు జానయ్య, బీఆర్ఎస్ నాయకులు దూళిపాల రాంచంద్రయ్య, రవి నాయక్, అనుముల శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ రాము, కలకొండ వెంకటేశ్వర్లు, నర్సింహారెడ్డి, పార్టీ మహిళా మండలాధ్యక్షురాలు మాద ధనలక్ష్మి పాల్గొన్నారు.
అభివృద్ధిపై చర్చ పెట్టాలి
కాంగ్రెస్, బీజేపీ విష ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు, అభివృద్ధిపై చర్చ పెట్టాలని ఎమ్మెల్యే భగత్‌కుమార్ కార్యకర్తలకు సూచించారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించడంతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు. ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఊరూరా, వాడవాడలా చర్చ పెట్టాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు విని వాళ్లకు ఓటేసి మళ్లీ మోసపోతే గోసపడుతామని పేర్కొన్నారు. 2018కు ముందు ఎమ్మెల్యేను కలవాలంటే వ్యయప్రయాసలు ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు మా నాన్న, తాను నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. తాను గెలిచిన రెండేండ్లలో సుమారు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు ఆలోచించి అభివృద్ధికి అండగా నిలవాలని కోరారు.
-ఎమ్మెల్యే భగత్‌కుమార్
సీఎం కేసీఆర్‌కు అండగా ఉంటాం
ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల గురించి ఆత్మీయ సమ్మేళనానికి రావడంతో తెలిసింది. ప్రతి ఇంటికీ ఎంతో ఒక పథకం వచ్చింది. రెండు, మూడు పథకాలు వచ్చిన ఇండ్లూ ఉన్నయి. ఇలాంటి పథకాలు అందిస్తున్న సీఎం కేసీఆర్ అండగా నిలిచేందుకు ప్రతిఒక్కరూ విస్తృత ప్రచారం చేయాలి.
– జానకమ్మ, కంపసాగర్