సూర్యాపేట టౌన్, నవంబర్ 5 : 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వేసిన ఓటుతో అభివృద్ధిలో జరిగిన మార్పులను ప్రజలంతా కండ్లారా చూస్తున్నారని.. కేవలం పదేండ్ల పాలనలోనే ప్రశాంత వాతావరణంలో ఐక్యతను పెంచుకుంటూ అన్ని ప్రాంతాల రూపురేఖలు మార్చుకున్నామని.. అందుకే ఈ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ను ఆదరించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని జీర్ణించుకోలేక.. పెరుగుతున్న ప్రజాదరణను తట్టుకోలేక కుట్రలు చేసేందుకు ద్రోహలంతా ఏకమై రాక్షస రాజకీయాలకు పాల్పడుతున్నట్లు దుయ్యబట్టారు.
అటువంటి విపక్ష నాయకుల కుట్రలను చేధించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని.. అభివృధ్ధి నిరోదకులకు విలువైన ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని 43వ వార్డులో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు, జై గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రైవేట్ స్కూల్స్ అసోషియేషన్ పట్టణాధ్యక్షుడు శేషగాని నరేశ్‌గౌడ్ తన అనుచరులతో అలాగే చివ్వెంల మండలానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి సుమారు 250 మంది ఆదివారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారందరినీ మంత్రి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి పాలకుల హాయాంలో అన్ని విధాలుగా ఆగమైన సూర్యాపేటను సీఎం కేసీఆర్ సారథ్యంలో జిల్లా కేంద్రంగా మార్చుకుని ఎవరూ ఊహించని విధంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటున్నట్లు చెప్పారు. 2014 నుంచి నిరంతర విద్యుత్, పుష్కలంగా తాగు, సాగు నీరు, రైతు బందు, రైతు బీమా, దళిత బంధు వంటి వినూత్న రీతిలో అందిస్తున్న సంక్షేమాలతో అన్ని ప్రాంతాల వాసులు సుఖసంతోషాలతో జీవిస్తున్నారన్నారు. అరవై ఏండ్లకు పైగా పాలించి అన్ని విధాలుగా ఆగం చేసిన ఆయా పార్టీలు అతి తక్కువ సమయంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి తట్టుకోలేక విషం కక్కుతున్నట్లు చెప్పారు. అభివృద్ధి నిరోధకులైన కాంగ్రెస్, బీజేపీ, చోటామోటా పార్టీలు కొత్తగా ఇప్పుడేదో చేస్తామంటే ప్రజలంతా నమ్మడం అటుంచి నవ్వుకుంటున్నారన్నారు.
విపక్షాలకు తగిన బుద్ధి చెప్పాలనే సంకల్పంతోనే అన్ని వర్గాల ప్రజలు ఆయా పార్టీలను వీడి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు. రాబోవు రోజుల్లోనూ మరింత ఐక్యతను పెంచుకుంటూ నిరంతర అభివృద్ధి పాలన కొనసాగించుకుందామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, జూలకంటి జీవన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బూర బాలసైదులు గౌడ్, నాయకులు బత్తుల ఝాన్సీ రమేశ్, కల్లేపల్లి మహేశ్వరి, ధశరథ, గాలి సాయికిరణ్, చల్లా లక్ష్మీకాంత్, బత్తుల జానీయాదవ్, వెంపటి సురేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.